జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు..
తెలుగు వారి దశాబ్దాల కల సాకారం చేసిన రైల్వే జోన్..
దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆవిర్భావం తెలుగు ప్రజల ఎన్నో ఏళ్ల కలకు నాంది పలికిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నం కేంద్రంగా జోన్ కార్యకలాపాలు జూన్ 1 నుంచి ప్రారంభం కానుండటాన్ని ఆయన చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఈ విజయాన్ని ప్రతి తెలుగు వాడి గెలుపుగా భావిస్తున్నానని, రైల్వే జోన్ సాధన కోసం జరిగిన ఉద్యమాల్లో భాగస్వామి కావడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు.
విశాఖపట్నంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రధాన హామీల్లో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఒకటని గుర్తు చేశారు. దశాబ్దాలుగా ప్రజలు చేసిన పోరాటం, ప్రజాప్రతినిధుల కృషి, తెలుగు ప్రజల ఆకాంక్షల ఫలితంగానే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పడిందన్నారు.
విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడిన ఈ జోన్ పరిధిలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. రైల్వే పరిపాలనలో వేగం పెరగడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి, కొత్త రైల్వే ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాల కల్పనలో ఈ జోన్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా ఇది కొత్త ఊపునిస్తుందన్నారు.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కట్టుబడి పనిచేస్తోందని పల్లా పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కావడం ప్రజల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు.
దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆవిర్భావాన్ని తెలుగు ప్రజల విజయోత్సవంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఈ చారిత్రాత్మక సందర్భాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు. ప్రతి నియోజకవర్గం, పట్టణం, గ్రామంలో సంబరాలు జరిపి, సమీప రైల్వే స్టేషన్లు, రైల్వే బోర్డుల వద్ద మిఠాయిలు పంచుకుని ఆనందాన్ని పంచుకోవాలని సూచించారు.
ఇది కేవలం పరిపాలనా నిర్ణయం మాత్రమే కాదని, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి, సంకల్పానికి దక్కిన గౌరవమని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆవిర్భావంతో రాష్ట్ర ప్రగతికి కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందని, ఈ విజయాన్ని ప్రతి ఒక్కరూ తమ విజయంగా భావించాలని ఆయన ఆకాంక్షించారు.