సింగపూర్ కు తాగు నీరు అందించడం, వరద నియంత్రణతో పాటు ఒక గొప్ప వినోద కేంద్రంగా నిలుస్తున్న మెరీనా బ్యారేజ్..
గ్రీన్ రూఫ్, మెరీనా బే సాండ్స్ వంటి కట్టడాల వ్యూ పాయింట్‌గా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న బ్యారేజ్ పరిసరాలు..
సింగపూర్: సింగపూర్‌లో కొనసాగుతున్న అధ్యయన పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం ప్రసిద్ధి చెందిన మెరీనా బ్యారేజ్ ను సందర్శించింది. నీటి నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన ఈ ప్రాజెక్ట్ గురించి మంత్రులు సమగ్రంగా అవగాహన పొందారు.
సింగపూర్‌కు తాగునీరు అందించడం, వరదలను నియంత్రించడం మాత్రమే కాకుండా ప్రజలకు వినోద కేంద్రంగా కూడా మెరీనా బ్యారేజ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా నీటి వనరులను సమర్థంగా వినియోగిస్తూ నగర అభివృద్ధిని ఎలా సాధించారో మంత్రులు ఆసక్తిగా పరిశీలించారు.
ఈ సందర్భంగా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌కు చెందిన NUS Cities డైరెక్టర్ ఖూ టెంగ్ చై, సింగపూర్ సాధించిన పురోగతి, పర్యావరణ అనుకూల నీటి సంరక్షణ విధానాల ప్రాముఖ్యతను మంత్రులకు వివరించారు. ప్రకృతిని కాపాడుకుంటూనే అభివృద్ధి సాధించడం ఎలా సాధ్యమైందో ఆయన వివరించడం మంత్రులను ఆకట్టుకుంది.
మెరీనా బ్యారేజ్ పరిసరాలు గ్రీన్ రూఫ్, మెరీనా బే సాండ్స్ వంటి నిర్మాణాల అందమైన దృశ్యాలను వీక్షించే వ్యూ పాయింట్‌గా కూడా ప్రసిద్ధి చెందాయి. పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ఈ ప్రాంతాన్ని మంత్రులు ప్రత్యక్షంగా సందర్శించి అనుభవించారు.
సింగపూర్ నీటి సమస్యలను పర్యావరణానికి హాని కలగకుండా ఎలా అధిగమించిందనే అంశాన్ని మంత్రులు ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. ఈ తరహా అభివృద్ధి నమూనాలను కృష్ణా నది తీరం, అమరావతి రాజధాని ప్రాంతాల్లో అమలు చేసే అవకాశాలపై కూడా చర్చించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, బి.సి. జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. సింగపూర్ మోడల్‌ను అధ్యయనం చేయడం ద్వారా అమరావతి అభివృద్ధికి కొత్త దారులు కనిపిస్తున్నాయని మంత్రులు అభిప్రాయపడ్డారు.