బెంగళూరు మహిళా ఆటో డ్రైవర్ కథ సోషల్ మీడియాలో హాట్ టాపిక్..
మహిళా ఆటో డ్రైవర్ ఆత్మవిశ్వాసానికి ముగ్ధులైన నెటిజన్లు..
బెంగళూరులో జరిగిన ఓ చిన్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో లక్షలాది మంది మనసులను తాకుతోంది. అమెజాన్‌లో పనిచేస్తున్న శ్రేయాశి సిన్హా అనే యువతి తన ఆటో ప్రయాణంలో ఎదురైన ఓ మహిళా ఆటో డ్రైవర్ గురించి సోషల్ మీడియాలో పంచుకున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. స్వాతంత్ర్యం, ఆత్మగౌరవం, మహిళల స్వయం ఉపాధి గురించి ఆ మహిళ చెప్పిన మాటలు నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటున్నాయి.
శ్రేయాశి సిన్హా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం, ఒక రోజు ఆమెను తీసుకెళ్లడానికి వచ్చిన మహిళా ఆటో డ్రైవర్ తన ఫోన్‌లో సమస్య రావడంతో దారిని చూపించాలని కోరింది. ప్రయాణం మధ్యలో ఇద్దరి మధ్య సాధారణంగా మాట్లాడుకుంటూ ఉండగా, “ఆటో డ్రైవింగ్‌ను ఎందుకు ఎంచుకున్నారు?” అని శ్రేయాశి అడిగింది.
దానికి ఆ మహిళ చిరునవ్వుతో ఇచ్చిన సమాధానం ఎంతో మందిని ఆలోచింపజేసింది. “పాత్రలు తోమడం కంటే ఆటో నడపడం మంచిది. నాకు తిరగడం ఇష్టం. ఇక్కడ టైమ్‌కి ఎలాంటి పరిమితి లేదు. ఎప్పుడైనా, ఎంతసేపైనా ఆటో నడపొచ్చు. ఎక్కడికైనా వెళ్లొచ్చు,” అని ఆమె చెప్పింది.
ఆ మాటల్లో ఆమెకు ఉన్న స్వేచ్ఛ, తన పని మీద గౌరవం స్పష్టంగా కనిపించాయని శ్రేయాశి పేర్కొన్నారు. “స్వాతంత్ర్యం, స్వేచ్ఛ ఇచ్చే పనిని ఎంచుకునే మహిళలను నేను నిజంగా గౌరవిస్తాను,” అంటూ ఆమె వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియో ప్రస్తుతం 30 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. సోషల్ మీడియా వేదికగా అనేక మంది నెటిజన్లు ఆ మహిళ ధైర్యాన్ని, ఆలోచనా విధానాన్ని ప్రశంసిస్తున్నారు. “ఇటీవల ఇంటర్నెట్‌లో చూసిన అత్యంత మంచి విషయం ఇదే,” అని ఒకరు కామెంట్ చేయగా, “ఆమె కేవలం స్వాతంత్ర్యం కోసం కాదు, తనకు నచ్చిన పని చేస్తోంది,” అని మరో వ్యక్తి స్పందించారు.
కొంతమంది మహిళా డ్రైవర్లను చూసినప్పుడు భద్రతగా అనిపిస్తుందని కూడా కామెంట్లు చేశారు. “వారం క్రితం నేనూ ఒక మహిళ ఆటో నడుపుతుండగా చూశాను. మహిళా డ్రైవర్ ఉంటే చాలా సేఫ్‌గా అనిపిస్తుంది,” అని ఓ నెటిజన్ పేర్కొన్నారు.
ఇంకొందరు ఆమె మాటలను తప్పుగా అర్థం చేసుకోవద్దని సూచించారు. “ఆమె ఏ పనినీ చిన్నచూపు చూడలేదు. తనకు స్వేచ్ఛ ఇచ్చే పని ఎంచుకుందంతే,” అని ఒకరు వ్యాఖ్యానించారు.
సాధారణ ఆటో ప్రయాణంగా మొదలైన ఈ సంఘటన, ఇప్పుడు మహిళల ఆత్మవిశ్వాసం, స్వయం ఉపాధి, స్వేచ్ఛ గురించి చర్చకు దారితీసింది. చిన్న మాటలతోనే ఆ మహిళ ఎంతో పెద్ద సందేశాన్ని సమాజానికి అందించిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.