Vijay Trisha Controversy: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, నటి త్రిషల వ్యక్తిగత వ్యవహారంపై ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తన తాజా చిత్రం 'కార్మేని సెల్వం' ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన, గతంలో విజయ్‌పై తాను చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఆ మాటలు రికార్డ్ అవుతున్నాయని తెలిసే మాట్లాడానని, అందులో పశ్చాత్తాపం చెందడానికి ఏమీ లేదని ఆయన కుండబద్దలు కొట్టారు.
విజయ్ తన భార్య సంగీతతో విడాకుల ఇష్యూ నడుస్తున్న సమయంలో, త్రిషతో కలిసి బహిరంగంగా ఒక వివాహ వేడుకకు హాజరుకావడంపై గతంలో సముద్రఖని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో విలేకరులు దీని గురించి ప్రశ్నించగా, సముద్రఖని ఏమాత్రం తడబడకుండా సమాధానమిచ్చారు. "నా మనసులో ఉన్న బాధనే బయటపెట్టాను. ఆ సమయంలో నాకు అనిపించింది మాట్లాడాను, అందులో దాచడానికి ఏముంది?" అని ఆయన ప్రశ్నించారు.
ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న తరుణంలో ఇలాంటి పనులు చేయడం సరికాదన్నది సముద్రఖని అభిప్రాయం. "విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని మొదటగా స్వాగతించిన వాళ్లలో నేనూ ఒకడిని. ఆయనకు నా పూర్తి మద్దతు ఉంది. కానీ, బాధ్యతాయుతమైన పదవిలోకి వెళ్లాలనుకునే వ్యక్తి ప్రవర్తన ఇలా ఉండటం చూసి తట్టుకోలేకపోయాను. అందుకే ఆ ఆవేదనను వ్యక్తపరిచాను. ఆ వ్యక్తి వీడియో తీస్తున్నాడని నాకు తెలుసు, తీసిన తర్వాత కూడా అతన్ని నేను ప్రశ్నించాను" అని సముద్రఖని వివరించారు.
గత ఫిబ్రవరిలో విజయ్ తన భార్యకు విడాకులు ఇస్తున్నారనే వార్తలు కోలీవుడ్‌ను కుదిపేశాయి. ఆ తర్వాత మార్చి 5న చెన్నైలో జరిగిన ఒక పెళ్లిలో విజయ్, త్రిష ఇద్దరూ ఒకే రకమైన రంగు దుస్తులు వేసుకుని కనిపించడం పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై సముద్రఖని స్పందిస్తూ.. "వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే అవి నాలుగు గోడల మధ్యే ఉండాలి. ఇలా అందరి ముందు ప్రదర్శించడం వల్ల ఎవరి మీద పగ తీర్చుకుంటున్నారు?" అంటూ ఘాటుగా ప్రశ్నించారు.
తాను మాట్లాడిన మాటల పట్ల తనకు ఎలాంటి విచారం లేదని ఆయన స్పష్టం చేశారు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా తాను అన్నది తప్పని అనిపించలేదని సముద్రఖని ధీమా వ్యక్తం చేశారు. కాగా, సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన 'కార్మేని సెల్వం' సినిమా ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి.