Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. గత కొంతకాలంగా మౌనంగా ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సొంత పార్టీ దిశగా అడుగులు వేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు, ప్రజల పక్షాన పోరాడేందుకు కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. నిజామాబాద్‌లోని జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు.
వచ్చే నెల ఏప్రిల్ 25వ తేదీన ఈ కొత్త పార్టీ ఆవిర్భావం జరగనుంది. ఆ రోజు ఉదయం 10 గంటలకు మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ హాల్ వేదికగా పార్టీ జెండాను, అజెండాను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమం కోసం ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్ 6 వద్ద సుమారు 20 ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కవిత పిలుపునిచ్చారు.
పార్టీ స్థాపన వెనుక ఉన్న కారణాలను వివరిస్తూ.. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సామాన్య ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని కవిత విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారుల ఆశయాలు నెరవేరడం లేదని, ప్రొఫెసర్ జయశంకర్ చూపిన బాటలో నడవాల్సిన అవసరం ఉదని ఆమె అభిప్రాయపడ్డారు. అందుకే తెలంగాణ సమాజం కోసం, ప్రజా సమస్యలపై నిలదీసే గొంతుకగా తన పార్టీ పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు. కొత్త తరం నాయకత్వానికి తమ పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.
ముఖ్యంగా మహిళా సాధికారతకు తన పార్టీ పెద్దపీట వేస్తుందని కవిత వెల్లడించారు. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుందని ఆమె నొక్కి చెప్పారు. పార్టీ విధివిధానాలు, భవిష్యత్ ప్రణాళికలపై సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని, మార్పు కోరుకునే వారందరూ తనతో కలిసి నడవాలని కోరారు. సలహాలు, సూచనలు ఇచ్చేందుకు త్వరలోనే ఒక వాట్సాప్ నంబర్‌ను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు.
ఇక ఎన్నికల బరిలో ఎక్కడ నుండి పోటీ చేస్తారనే విషయంపై ఆమె స్పష్టత ఇవ్వలేదు. పార్టీ ఆవిర్భావ సభ ముగిసిన తర్వాత కార్యవర్గంతో చర్చించి, ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయాలనేది నిర్ణయిస్తామని చెప్పారు. నిజామాబాద్ కోడలిగా ఇక్కడి నుండే ఈ ప్రకటన చేయడం సంతోషంగా ఉందని కవిత పేర్కొన్నారు. కవిత తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.