Travel: తొలి విడతలో 10 నగరాలకు విమానాలు
ముందు వరుసలో మూడు ఎయిర్‌లైన్స్
ఎన్‌సీఆర్ రూపురేఖలు మారనున్నాయా?
Noida International Airport: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మరో చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (జేవార్) మొదటి దశను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఘనంగా ప్రారంభించనున్నారు. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో ప్రయాణికుల రద్దీ తగ్గడమే కాకుండా, పారిశ్రామికంగా కూడా పెను మార్పులు రానున్నాయి.
విమానాశ్రయం ప్రారంభమైనప్పటికీ, కమర్షియల్ ఫ్లైట్లు పూర్తిస్థాయిలో తిరగడానికి మరికొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే, ప్రారంభమైన 45 రోజుల్లోనే దేశంలోని కీలకమైన 10 నగరాలకు సర్వీసులు మొదలవుతాయని సమాచారం. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, పూణే, లక్నో, అహ్మదాబాద్, చెన్నై, గోవా జైపూర్ వంటి మెట్రో నగరాలకు నేరుగా విమానాలు నడపాలని అధికారులు యోచిస్తున్నారు.
మొదటి దశలో కార్యకలాపాలు ప్రారంభించడానికి ఇండిగో ఆకాశ ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. టిక్కెట్ బుకింగ్‌లు ఎప్పుడు మొదలవుతాయన్న దానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ, విమాన సర్వీసులు ప్రారంభం కావడానికి కనీసం 2 నుండి 4 వారాల ముందే బుకింగ్ విండో ఓపెన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ విమానాశ్రయం వల్ల కేవలం ప్రయాణ సౌకర్యాలే కాకుండా, నోయిడా గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం భారీగా పుంజుకోనుంది. వేల సంఖ్యలో కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. కాగా, రేపు జరగబోయే భారీ బహిరంగ సభ కోసం ఇప్పటికే ఘజియాబాద్ వంటి ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. భద్రతా పరంగా కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ప్రస్తుతానికి ఎయిర్‌లైన్స్ నుంచి ఎలాంటి అధికారిక షెడ్యూల్ విడుదల కాలేదు. కాబట్టి ప్రయాణికులు విమాన టిక్కెట్ల కోసం అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే సంప్రదించాలని, తప్పుడు వార్తలను నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే విమానాల సమయ వేళలపై స్పష్టత రానుంది.