Congo News: పెరుగుతున్న గొరిల్లాల సంఖ్య
కవలల సంరక్షణ ఒక సవాలు
పర్యావరణానికి శుభసంకేతం
Virunga National Park: ప్రకృతి ప్రేమికులకు, జంతు సంరక్షకులకు ఒక తీపి కబురు ఆఫ్రికాలోని కాంగో దేశంలో ఉన్న విరుంగా నేషనల్ పార్క్‌లో అత్యంత అరుదైన 'పర్వత గొరిల్లా' ) కవలలు జన్మించాయి. సాధారణంగా గొరిల్లాల్లో కవలలు పుట్టడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. వంద పుట్టుకల్లో కేవలం ఒక శాతమే ఇలాంటి అవకాశం ఉంటుంది. అయితే, గడిచిన మూడు నెలల వ్యవధిలోనే ఇది రెండో జంట కావడం విశేషం. బరాకా అనే గొరిల్లా కుటుంబంలో ఒక మగ, ఒక ఆడ శిశువు జన్మించినట్లు అటవీ అధికారులు ధృవీకరించారు.
విరుంగా నేషనల్ పార్క్ అనేది ఆఫ్రికాలోనే అత్యంత పురాతనమైన అభయారణ్యం. ఇక్కడ గొరిల్లాల సంరక్షణ కోసం నిపుణులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ప్రస్తుతం కాంగోలో రాజకీయ అనిశ్చితి, అశాంతి నెలకొన్నప్పటికీ, అటవీ సిబ్బంది గొరిల్లాల సంరక్షణను ఏమాత్రం విస్మరించలేదు. గొరిల్లాలకు తగిన ఆహారం, వైద్యం అందుబాటులో ఉండటం వల్లే ఇవి ఆరోగ్యంగా ఉన్నాయని, అందుకే ఇలాంటి అరుదైన సంతానోత్పత్తి సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు. తల్లి గొరిల్లా శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడు మాత్రమే కవలలు పుట్టే అవకాశం ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు.
ఒకప్పుడు ఈ పర్వత గొరిల్లాలు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. 1970వ దశకంలో వీటి సంఖ్య కేవలం 250కి పడిపోయింది. ఆ సమయంలో ఇవి భూమిపై నుంచి తుడిచిపెట్టుకుపోతాయేమోనని అందరూ ఆందోళన చెందారు. కానీ అంతర్జాతీయ సంస్థల సహకారం, మెరుగైన వైద్యం కారణంగా వీటి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2018 నాటికి వీటి సంఖ్య వెయ్యి దాటడంతో, వీటిని 'అత్యంత ప్రమాదకర' జాబితా నుంచి 'ప్రమాదకర' జాబితాలోకి మార్చారు. గొరిల్లా డాక్టర్లు చేసే ఆపరేషన్లు, వేటగాళ్ల నుంచి రక్షణ కల్పించడం వల్ల ఈ మార్పు సాధ్యమైంది.
గొరిల్లాలు తమ పిల్లలను మనుషుల కంటే అపురూపంగా చూసుకుంటాయి. ముఖ్యంగా కవల పిల్లలు పుట్టినప్పుడు వాటిని మోయడం, పాలు పట్టడం తల్లికి పెద్ద సవాలుగా మారుతుంది. అయితే, గొరిల్లా గుంపులోని ఇతర సభ్యులు ఈ విషయంలో తల్లికి సాయం చేయడం ఒక విశేషం. తమ గుంపులోని చిన్నారి ప్రాణాలను కాపాడటంలో మిగిలిన గొరిల్లాలు బాధ్యత తీసుకుంటాయి. ప్రస్తుతం పుట్టిన రెండు శిశువులు ఆరోగ్యంగా ఉన్నాయని, వాటిని నిరంతరం పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పార్క్ అధికారులు తెలిపారు.
ప్రకృతిలో సమతుల్యత దెబ్బతింటున్న ఈ కాలంలో, ఇలాంటి అరుదైన జంతువుల సంఖ్య పెరగడం పర్యావరణ వేత్తల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. విరుంగా పార్క్ కేవలం జంతువులకే కాక, ప్రపంచ పర్యావరణానికి కూడా ఎంతో ముఖ్యం. వేటగాళ్ల ముప్పు ఉన్నప్పటికీ, అడవిలో కొత్త జీవం పుట్టుకురావడం ఒక అద్భుతమని అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ బుజ్జి గొరిల్లాల రాకతో పార్క్‌లో సందడి నెలకొంది.