Aditya Dhar Net Worth: ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ ప్రియుల నోళ్లలో నానుతున్న ఒకే ఒక్క పేరు 'ఆదిత్య ధర్'. కేవలం మూడు గంటల సినిమా చూసేందుకే ఓపిక లేని ఈ రోజుల్లో, ఏకంగా 7 గంటల నిడివి గల ‘ధురంధర్’ చిత్రాన్ని తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సినిమా మధ్యలో ఒక్క నిమిషం పక్కకు వెళ్లినా ఎక్కడ సీన్ మిస్ అవుతామో అన్నంత ఉత్కంఠను రేకెత్తించడంలో ఆదిత్య సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుండటంతో, అసలు ఈ దర్శకుడి నేపథ్యం ఏంటి ఆయన ఆస్తుల విలువ ఎంత అనే విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఆదిత్య ధర్ జీవితం ఒక సినిమా కథ కంటే తక్కువ ఏమీ కాదు. ఢిల్లీకి చెందిన ఆదిత్యకు చిన్నప్పటి నుంచి చదువు కంటే క్రికెట్ అంటేనే అమితమైన ఇష్టం. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా రాణిస్తూ, టీమ్ ఇండియాకు ఆడాలనే లక్ష్యంతో ఉండేవారు. అయితే 2002 వరల్డ్ కప్ ఎంపికలో అవకాశం దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు లోనై ఆటకు గుడ్ బై చెప్పారు. కానీ అక్కడే ఆయన మరో ప్రయాణం మొదలైంది. కథలు చెప్పడంపై ఆసక్తితో ముంబై చేరుకుని, తొలినాళ్లలో ఎన్నో కష్టాలను అనుభవించారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ సినిమా మెళకువలను నేర్చుకున్నారు.
ఆదిత్య ధర్ కష్టం వృథా పోలేదు. 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. ఆ ఒక్క సినిమాతో ఆయన రేంజ్ మారిపోయింది. తాజాగా విడుదలైన 'ధురంధర్ 2' సినిమా కేవలం రెండు రోజుల్లోనే 200 కోట్ల క్లబ్‌లో చేరిందంటే ఆయన క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మొదటి భాగం 1300 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, రెండో భాగం అంతకు మించి కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక ఆదిత్య ధర్ ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే, ఆయన నెట్ వర్త్ సుమారు 25 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఆయన భార్య, ప్రముఖ నటి యామీ గౌతమ్ ఆస్తి సుమారు 100 కోట్లు. వీరిద్దరి మొత్తం ఆస్తుల విలువ 125 కోట్ల వరకు ఉంటుంది. ముంబైలోని అత్యంత విలాసవంతమైన బాంద్రా వెస్ట్ ప్రాంతంలో వీరికి 20 కోట్ల విలువైన సొంత ఇల్లు ఉంది. ఇందులో జిమ్, హోమ్ థియేటర్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి.
వీటితో పాటు చండీగఢ్‌లో ఒక డ్యూప్లెక్స్ హౌస్, హిమాచల్ ప్రదేశ్‌లో ఒక పురాతన ఇల్లు కూడా ఉన్నాయి.ఇంత ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ, ఈ జంట చాలా సాదాసీదాగా ఉండటానికే ఇష్టపడతారు. ఆడంబరాలకు దూరంగా, కేవలం కొద్దిమంది బంధువుల సమక్షంలో వీరు చేసుకున్న వివాహం అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. ప్రస్తుతం వీరి దగ్గర బిఎమ్‌డబ్ల్యూ ఆడి క్యూ7 వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం, తన పనితోనే సమాధానం చెప్పడం ఆదిత్య ధర్ ప్రత్యేకత. ధురంధర్ మేనియా ఇప్పట్లో తగ్గేలా లేదు, మరి ఈ సినిమా ఇంకా ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి..