హాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా హాలీవుడ్ చిత్రం ‘ది బ్లఫ్’ ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పైరేట్ నేపథ్యంతో రూపొందిన ఈ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా ప్రియాంక చోప్రా స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సన్నివేశాలు అభిమానులను బాగా ఇంప్రెస్ చేశాయి.
ఈ ట్రైలర్‌ను చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రియాంక చోప్రాపై ప్రశంసల జల్లు కురిపించారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘ది బ్లఫ్’ ట్రైలర్‌ను షేర్ చేస్తూ, ప్రియాంకను “ఫార్మిడబుల్” అని అభివర్ణించారు. అంటే మరింత శక్తివంతమైన నటి అని అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. ట్రైలర్ చాలా బాగుందని, ప్రియాంక మరోసారి తన నటనతో ఆశ్చర్యపరిచిందని మహేశ్ బాబు పేర్కొన్నారు. అలాగే ఈ సినిమా బృందానికి ముందుగానే శుభాకాంక్షలు తెలిపారు.
మహేశ్ బాబు ప్రశంసలకు ప్రియాంక చోప్రా కూడా స్పందించారు. “ధన్యవాదాలు నా దోస్త్” అంటూ సరదాగా రిప్లై ఇవ్వడం అభిమానులను మరింత ఆకట్టుకుంది. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని ఈ మాటలు మరోసారి చాటిచెప్పాయి. ప్రస్తుతం ఈ స్పందనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫ్యాన్స్ మధ్య చర్చనీయాంశంగా మారాయి.
ఇదే ట్రైలర్‌పై ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుమారుడు, నిర్మాత ఎస్‌ఎస్ కార్తికేయ కూడా స్పందించారు. ప్రియాంక చోప్రా ప్రతిసారీ ఇలాంటి పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ఎలా మెప్పిస్తుందో అర్థం కావడం లేదంటూ ప్రశంసించారు. ఫిబ్రవరి 25 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. దీనికి ప్రియాంక చోప్రా కూడా ధన్యవాదాలు చెబుతూ, మీ మాటలు చాలా ఆనందంగా ఉన్నాయంటూ బదులిచ్చారు.
‘ది బ్లఫ్’ సినిమా కథ 19వ శతాబ్దపు కరీబియన్ దీవుల నేపథ్యంలో సాగుతుంది. ఇందులో ప్రియాంక చోప్రా ఒక సముద్ర దొంగ పాత్రలో కనిపించనున్నారు. గతాన్ని వదిలేసి ప్రశాంతమైన జీవితం గడపాలనుకునే మహిళగా ఆమె పాత్ర ఉంటుంది. అయితే పరిస్థితులు ఆమెను మళ్లీ ఆయుధం పట్టుకునేలా చేస్తాయి. తన కుటుంబాన్ని, పిల్లలను కాపాడుకోవడానికి ఆమె చేసే పోరాటమే ఈ సినిమా కథాంశం. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా ఓటీటీ రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 25 నుంచి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
మరోవైపు, మహేశ్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండడం విశేషం. ఇండియన్ మైథాలజీ ఆధారంగా రూపొందుతున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ మూవీ 2027 సంక్రాంతికి విడుదల కానుంది. ఇందులో మహేశ్ బాబు ‘రుద్ర’ పాత్రలో, ప్రియాంక చోప్రా ‘మందాకిని’ పాత్రలో కనిపించనున్నారు. అలాగే మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక ప్రతినాయక పాత్రలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసినదే.