ప్రస్తుతం దేశవ్యాప్తంగా విద్యుత్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలు కరెంటు బిల్లుల విషయంలో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా వేసవి కాలం సమీపిస్తున్న వేళ ఫ్యాన్లు, ఏసీలు, ఫ్రిజ్‌ల వినియోగం పెరగనుండటంతో బిల్లులు మరింత భారంగా మారే అవకాశాలు ఉన్నాయి. అయితే చాలాసార్లు మనం జాగ్రత్తగా వినియోగించినా కూడా కరెంటు బిల్లు అంచనాలకు మించి రావడానికి కొన్ని సాంకేతిక కారణాలు ఉండొచ్చు. వాటిలో ముఖ్యమైనది విద్యుత్ మీటర్‌కు సంబంధించిన లోపం. చాలా మంది ఇళ్లలో ఉండే డిజిటల్ విద్యుత్ మీటర్లలో కనిపించే చిన్న రెడ్ లైట్ ఈ విషయంలో కీలక సంకేతంగా పనిచేస్తుంది.
డిజిటల్ విద్యుత్ మీటర్‌పై ఉండే రెడ్ లైట్ సాధారణంగా విద్యుత్ వినియోగాన్ని సూచిస్తుంది. ఇంట్లో విద్యుత్ పరికరాలు పనిచేస్తున్నప్పుడు ఈ లైట్ మెల్లగా బ్లింక్ అవుతూ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇంట్లో అన్ని లైట్లు, ఫ్యాన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఆఫ్ చేసినప్పటికీ ఆ రెడ్ లైట్ వేగంగా బ్లింక్ అవుతుంటే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఇది మీటర్ సరిగా పని చేయడం లేదన్న సూచన కావచ్చు.
విద్యుత్ మీటర్ చెడిపోవడానికి పలు కారణాలు ఉండొచ్చు. మీటర్‌లో అంతర్గతంగా ఏర్పడిన సాంకేతిక లోపాలు, వైర్లు పాడవడం, తేమ లేదా వాతావరణ ప్రభావం వల్ల భాగాలు దెబ్బతినడం వంటి అంశాలు మీటర్ పనితీరును ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు మీటర్ లోపల ఉన్న సర్క్యూట్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల నిజమైన వినియోగం కంటే ఎక్కువ యూనిట్లు నమోదు అవుతాయి. ఫలితంగా కరెంటు బిల్లు అధికంగా వస్తుంది. దీనితో పాటు అకస్మాత్తుగా విద్యుత్ కోతలు, లోడ్ సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశముంటుంది.
మీటర్‌లో సమస్య ఉందో లేదో తెలుసుకోవాలంటే ముందుగా మెయిన్ స్విచ్‌ను ఆఫ్ చేయాలి. అనంతరం మీటర్‌పై ఉన్న రెడ్ లైట్‌ను గమనించాలి. ఇంట్లో ఎలాంటి విద్యుత్ వినియోగం లేకపోయినా రెడ్ లైట్ నిరంతరం లేదా వేగంగా బ్లింక్ అవుతుంటే అది తప్పనిసరిగా లోపానికి సంకేతంగా భావించాలి. ఇలాంటి పరిస్థితిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవడం అవసరం.
ఈ తరహా సమస్యలు ఎదురైతే మీటర్‌ను మీరే మార్చేందుకు ప్రయత్నించకుండా స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం ఉత్తమం. వారు మీటర్‌ను పరిశీలించి అవసరమైతే కొత్త మీటర్‌ను ఏర్పాటు చేస్తారు. సకాలంలో ఫిర్యాదు చేయడం వల్ల అనవసరంగా అధిక బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి తప్పుతుంది. విద్యుత్‌ను ఆదా చేసుకోవాలంటే వినియోగంతో పాటు మీటర్ పనితీరుపై కూడా తరచూ దృష్టి పెట్టడం ఎంతో అవసరం. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే పెరుగుతున్న కరెంటు ఖర్చును కొంతవరకు నియంత్రించుకోవచ్చు.