ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలను లక్ష్యంగా చేసుకుని ఖలిస్థానీ మరియు బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ ముప్పు తీవ్రంగా ఉందని, దేశ వ్యాప్తంగా భద్రతా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు అధికారులు తెలిపారు. గణతంత్ర వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉగ్రవాదులు ఏ క్షణంలోనైనా దాడులు చేపట్టే అవకాశం ఉందన్న సమాచారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హై అలర్ట్ ప్రకటించాయి.
హర్యానా, ఢిల్లీ–ఎన్‌సీఆర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉగ్ర నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే పోలీస్, ఇంటెలిజెన్స్ శాఖలు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాయి. కీలక ప్రభుత్వ భవనాలు, రద్దీ ప్రాంతాలు, రవాణా కేంద్రాలు, సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీతో పాటు ఇతర ప్రధాన నగరాల్లో అదనపు బలగాలను మోహరించి, అనుమానితులపై గట్టి నిఘా కొనసాగిస్తున్నారు.
దేశ అంతర్గత భద్రతను దెబ్బతీయాలనే లక్ష్యంతో ఖలిస్థానీ, బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు స్థానిక గ్యాంగ్‌స్టర్లను ఉపయోగించుకుంటున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. డ్రగ్ మాఫియా, ఆయుధాల అక్రమ రవాణా, బెదిరింపులు వంటి నేరాల్లో నిమగ్నమైన గ్యాంగ్‌స్టర్లను ఉగ్రవాదానికి పనికివచ్చేలా మలుస్తున్నారని తెలిపాయి. గత ఏడాది ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలుడు ఘటన ఈ ముప్పును మరింత స్పష్టంగా చూపిందని అధికారులు గుర్తు చేస్తున్నారు.
పంజాబ్‌కు చెందిన కొంతమంది గ్యాంగ్‌స్టర్లు విదేశాల్లో కూర్చొని పనిచేస్తున్న ఖలిస్థానీ, రాడికల్ హ్యాండ్లర్లకు సహకరిస్తున్నట్లు నిఘా నివేదికలు చెబుతున్నాయి. ఉగ్రవాద సంస్థలు తమ ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు, దేశంలో అస్థిరత సృష్టించేందుకు క్రిమినల్ నెట్‌వర్క్‌లను ఆయుధంగా మార్చుకుంటున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు భద్రతా చర్యలను మరింత కఠినతరం చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.