Wisdom tooth pain symptoms: మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు 28 పళ్లే ఉంటాయి. కానీ 20 ఏళ్లు దాటాక దవడ చివర్లో కొత్తగా రెండు జతల పళ్లు రావడం మొదలవుతాయి. వీటినే మనం 'జ్ఞానదంతాలు' అంటాం. పాత కాలంలో మన పూర్వీకులు గట్టి గింజలు, పచ్చి మాంసం తినేవారు కాబట్టి వాళ్లకు ఈ పళ్లు బాగా వాడేవారు. కానీ ఇప్పుడు మనం అన్నీ ఉడికించిన మెత్తటి పదార్థాలే తింటున్నాం. దీనివల్ల మన దవడ సైజు తగ్గిపోయింది. ఆ పళ్లు రావడానికి లోపల తగినంత చోటు లేక పక్క పళ్లను తోయడం, చిగుళ్లను చీల్చడం వల్ల విపరీతమైన నొప్పి పుడుతుంది.
చాలామందికి ఒక పెద్ద భయం ఉంది. పన్ను తీయిస్తే కళ్లు పోతాయని, చూపు మందగిస్తుందని అనుకుంటారు. ముఖ్యంగా పెద్దవాళ్లు "కంటి నరాలు దెబ్బతింటాయి జాగ్రత్త అని భయపెడుతుంటారు. కానీ ఇది ముమ్మాటికీ అపోహ మాత్రమే. మన దంతాలకు ఉండే నరాలు వేరు, కంటికి ఉండే నరాలు వేరు. కంటి చూపును కంట్రోల్ చేసే నరాలు మెదడు నుంచి నేరుగా కళ్లకు వెళ్తాయి. వాటికి ఈ దవడ పళ్లతో ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి జ్ఞానదంతం తీయించుకోవడం వల్ల చూపు తగ్గుతుందనే మాటలో అస్సలు నిజం లేదు.
కొందరికి ఈ పన్ను తిన్నగా రాకుండా పక్కకు వంగి వస్తుంది. దీనివల్ల పక్కన ఉన్న మంచి పన్ను పాడైపోతుంది. అంతేకాదు, ఆ సందులో అన్నం ముక్కలు ఇరుక్కుపోయి కుళ్లిపోయి నోరు వాసన రావడం, ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు పన్ను వస్తున్నప్పుడు భరించలేని నొప్పి ఉన్నా, దవడ వాపు వచ్చినా వెంటనే డెంటిస్ట్ దగ్గరకు వెళ్లడం మంచిది. దాన్ని అలాగే వదిలేస్తే పక్కన ఉన్న పళ్లు కూడా పుచ్చిపోయి ఇంకా ఎక్కువ ఖర్చవుతుంది.
ఇప్పుడున్న రోజుల్లో పన్ను తీయడం అనేది చాలా చిన్న విషయం. డాక్టర్లు ఆ పంటి దగ్గర ఇంజక్షన్ ఇచ్చి మొద్దుబారేలా చేస్తారు. కాబట్టి మీకు నొప్పి అస్సలు తెలియదు. ఒక పది నిమిషాల్లో ఆ పన్ను తీసేయొచ్చు. ఆ తర్వాత రెండు రోజులు డాక్టర్ చెప్పినట్టు మందులు వేసుకుంటే చాలు, తగ్గిపోతుంది. దీనివల్ల మెదడుకు గానీ, కళ్లకు గానీ ఎటువంటి ప్రమాదం జరగదు. ఇది పూర్తిగా సురక్షితమైన పద్ధతి.
చివరగా చెప్పేదేంటంటే, ఎవరో చెప్పిన మాటలు విని అనవసరంగా భయపడకండి. పన్ను నొప్పిని భరిస్తూ కూర్చుంటే అది ఇంకా పెద్ద సమస్య అవుతుంది. డాక్టర్లు ఎక్స్-రే తీసి ఆ పన్ను అవసరమో లేదో చెప్తారు. ఒకవేళ తీయాల్సి వచ్చినా ధైర్యంగా తీయించుకోవచ్చు. దంతాల ఆరోగ్యం బాగుంటేనే మనం హాయిగా తిని, నవ్వుతూ ఉండగలం. కాబట్టి అనవసరపు పుకార్లను పక్కన పెట్టేయండి.