వడగాలులతో ఢిల్లీ వణుకు.. ఐఎండీ హెచ్చరికలు..
దేశ రాజధానిపై ఎండల ఎఫెక్ట్.. వడగాలులపై ఎల్లో అలర్ట్..
దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు రోజురోజుకీ మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వచ్చే మూడు రోజుల పాటు ఢిల్లీలో వడగాలుల పరిస్థితులు కొనసాగనున్నాయని హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఎండలు, వేడి గాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉందని తెలిపింది.
ఐఎండీ అంచనాల ప్రకారం, ఇవాళ ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత సుమారు 28 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉండొచ్చని పేర్కొంది. గత 24 గంటల్లో కూడా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. రాత్రి సమయంలో కూడా ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల వద్ద కొనసాగడంతో ప్రజలకు ఉపశమనం లేకుండా పోయింది.
ఢిల్లీ రిడ్జ్ ప్రాంతంలోని ఐఎండీ కేంద్రంలో అత్యధికంగా 44.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సఫ్దర్జంగ్ కేంద్రంలో 43.4 డిగ్రీలు, లోధీ రోడ్ కేంద్రంలో 43.8 డిగ్రీలు, పాలం ప్రాంతంలో 43.5 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. ఉదయం నుంచే మండుతున్న ఎండలు, వేడిగాలులతో రహదారులు వెలవెలబోతున్నాయి.
వైద్య నిపుణులు ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. తగినంత నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం, ఎండ నుంచి జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని హెచ్చరిస్తున్నారు. మరోవైపు, ఎండల తీవ్రతతో విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరిగింది. ఢిల్లీలో వాతావరణ పరిస్థితులు మరికొన్ని రోజులు ఇదే విధంగా కొనసాగే అవకాశముందని ఐఎండీ తెలిపింది.