మన ఇల్లు, మన వీధి, మన గ్రామం నినాదంతో ప్రతి ఒక్కరూ పరిశుభ్రత చర్యలు పాటించాలి..
గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత..
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండలో నిర్వహించిన “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర” కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పాల్గొన్నారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
కార్యక్రమంలో భాగంగా మంత్రి స్వయంగా డస్ట్‌బిన్ పట్టుకుని చెత్తను సేకరించి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం ప్రజలతో కలిసి పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. “మన ఇల్లు – మన వీధి – మన గ్రామం” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ పరిశుభ్రత చర్యల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మంత్రి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మన ఇల్లు శుభ్రంగా ఉండటమే కాకుండా మన వీధి, గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం కూడా పరిశుభ్రంగా ఉండేలా అందరూ కృషి చేయాలని సూచించారు.
రాష్ట్రం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి “తల్లికి వందనం”, “స్త్రీ శక్తి”, “దివ్యాంగశక్తి”, “దీపం”, “అన్నదాత సుఖీభవ” వంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు.
మహిళల సాధికారతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి పేర్కొన్నారు. సెర్ప్, మెప్మా, డీఆర్‌డీఏ సంస్థల సహకారంతో మహిళలకు సబ్సిడీ రుణాలు అందించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ చర్యలతో మహిళలు ఆర్థికంగా బలపడుతున్నారని చెప్పారు.
కూటమి ప్రభుత్వ పాలనలో గ్రామాల్లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని మంత్రి అన్నారు. గ్రామాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు.
ప్రస్తుత యుద్ధ పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ప్రజలంతా పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారని మంత్రి గుర్తుచేశారు. అదే కారణంతో సీఎం చంద్రబాబు మహానాడు కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారని చెప్పారు. భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక సమస్యలను ముందుగానే ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పొదుపు చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రజలంతా కూడా అవసరమైన చోట ఖర్చులను తగ్గించి పొదుపు అలవాటు చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమం అనంతరం మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సింగరాయకొండలోని వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, శ్రీ వీరాంజనేయస్వామి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.