- గ్రామాల నుంచి కొలంబియా వరకు అనిశ్చితి నెలకొంటే చర్చల ద్వారా మార్పులు తెచ్చినట్లు వెల్లడి..
- ఫౌండేషన్ 45 వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం..
Chandrababu: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపుతున్న 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' వంటి అంతర్జాతీయ సేవా సంస్థలు నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ జన్మదినోత్సవ వేడుకలతో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ స్థాపించి 45 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ తరుణంలో ఈ చారిత్రాత్మక ఉత్సవంలో భాగస్వామ్యం కావడం ఒక భారతీయుడిగా తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు. తాను ఇక్కడికి కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలోనే రాలేదని, గురూజీ మానవీయ బోధనలను ఎంతగానో విశ్వసించి, అనుసరిస్తున్న ఒక సాధారణ భారతీయుడిగా విచ్చేశానని స్పష్టం చేశారు. రవిశంకర్ గురూజీ కేవలం ఆధ్యాత్మికతను మాత్రమే బోధించే ఒక సాధారణ సన్యాసి కాదని, ప్రపంచవ్యాప్తంగా శాంతిసామరస్యాలను పెంపొందించేందుకు నిరంతరం శ్రమిస్తున్న 'ప్రపంచ మానవుడు' అని చంద్రబాబు కొనియాడారు. ప్రాచీన భారతీయ వైదిక విజ్ఞానానికి మరియు నేటి ఆధునిక డిజిటల్ ప్రపంచానికి మధ్య ఒక అద్భుతమైన వారధిగా గురూజీ వ్యవహరిస్తున్నారని, హింసలేని సమాజం మరియు ఒత్తిడి లేని మనుషులను తయారు చేయడమే ధ్యేయంగా దశాబ్దాలుగా ఆయన మానవాళికి చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు, అంతర్గత కలహాల వల్ల అంతర్జాతీయ సమాజం శాంతికి దూరమై తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటోందని, ఇలాంటి క్లిష్ట సమయంలో మానవత్వం అనే అత్యుత్తమ మార్గం ద్వారానే శాంతిని పునరుద్ధరించవచ్చని గురూజీ నిరూపించారని ముఖ్యమంత్రి కొనియాడారు. తీవ్ర ఉద్రిక్తతలు ఉన్న యుద్ధక్షేత్రాలలో సైతం ఆయన సంప్రదింపులు, అంతర్గత మానసిక శక్తి (ఇన్నర్ స్ట్రెంత్) వంటి శాంతియుత విధానాల ద్వారా అద్భుత మార్పులు తీసుకువచ్చారని గుర్తుచేశారు. దేశంలోని వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల నుంచి అంతర్జాతీయ సంస్థల వరకు, అలాగే దశాబ్దాలుగా తీవ్రవాదంతో అట్టుడికిన కొలంబియా వంటి అంతర్జాతీయ సమస్యాత్మక ప్రాంతాలలో సైతం చర్చల ద్వారా శాంతిని నెలకొల్పిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అందుకే సామాన్య ప్రజలతో పాటు ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థల నమ్మకాన్ని గెలుచుకున్న గొప్ప దౌత్య ఆధ్యాత్మికవేత్తగా శ్రీ రవిశంకర్ గురూజీ నిలిచారని పేర్కొన్నారు. దాదాపు 45 ఏళ్ల క్రితమే 'హ్యాపీ హ్యూమన్ బీయింగ్, స్ట్రెస్ ఫ్రీ సొసైటీ అండ్ బెటర్ వరల్డ్' అనే అత్యున్నత దూరదృష్టితో ప్రారంభమైన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రస్థానం నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపిందని అభినందించారు. కేవలం యోగా, ధ్యానం మాత్రమే కాకుండా సురక్షిత తాగునీటి సరఫరా, నదుల పునరుజ్జీవనం, మహిళా స్వయం సమృద్ధి మరియు విలువలతో కూడిన విద్య వంటి ఎన్నో సామాజిక రంగాలలో ఈ ఫౌండేషన్ అందిస్తున్న సేవలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కొనియాడారు.
ప్రస్తుత ఆధునిక కాలంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి అత్యాధునిక సాంకేతికతలు మానవుడి రోజువారీ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని, అదే సమయంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్, ముడి చమురు వంటి సహజ ఇంధన వనరుల లభ్యత మరియు మార్కెట్ ఒడిదుడుకులు సామాన్య మానవుడి జీవితాన్ని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మానసిక ప్రశాంతతను కాపాడుకుంటూ సమర్థవంతంగా జీవించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇలాంటి సంక్షోభ సమయాల్లోనే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి సంస్థలు మానవాళికి మానసిక స్థైర్యాన్ని ఇస్తూ అత్యుత్తమ సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం దేశానికి నరేంద్ర మోదీ లాంటి అత్యంత సమర్థవంతమైన నాయకుడు ప్రధానిగా వ్యవహరిస్తున్నారని, ఆయన నాయకత్వంలో భారతదేశం అంతర్జాతీయంగా అగ్రగామిగా ఎదుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. వేల సంవత్సరాల క్రితమే ప్రపంచ దేశాలకు శాంతి మార్గాన్ని, జీవన విధానాన్ని నేర్పిన ఘనమైన సంస్కృతి మన దేశానిదని, ఆధునిక జీవనంలో సంస్కృతితో మిళితమైన విలువల ప్రాధాన్యతను గురూజీ తన బోధనల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారని గుర్తుచేశారు. గతంలో తాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు ఒత్తిడిని అధిగమించేందుకు వీలుగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు.
తాను కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న పవిత్ర తిరుమల తిరుపతి నేల నుంచి వచ్చానని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా తమ జీవితంలో ఒక్కసారైనా ఆ శ్రీవారిని దర్శించుకోవాలని కోరుకుంటారని చంద్రబాబు పేర్కొన్నారు. తిరుపతితో పాటు శ్రీశైలం, అహోబిలం, అన్నవరం, సింహాచలం వంటి ఎన్నో చారిత్రాత్మక ఆధ్యాత్మిక క్షేత్రాలు నిండిన పుణ్యభూమి ఆంధ్రప్రదేశ్ అని కొనియాడారు. ప్రస్తుతం తమ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను వేగంగా నిర్మిస్తోందని, దీనివల్ల పెద్ద ఎత్తున పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. అయితే తన ఉద్దేశంలో నిజమైన అభివృద్ధి అంటే కేవలం ఆర్థిక ప్రగతి, ఐటీ టెక్నాలజీలు మాత్రమే కాదని, క్షేత్రస్థాయిలో ప్రజల జీవన ప్రమాణాలను సంతోషకరంగా మార్చడమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడూ పూర్తి శాంతిసౌఖ్యాలతో, ఆనందంగా జీవించాలన్నదే తన ఏకైక ఆశయమని, ఏపీ సమీకృత మరియు సర్వతోముఖాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని చెప్పారు. ఇందుకోసమే పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్షిప్కు అదనంగా 'సొసైటీ'ని చేరుస్తూ 'P4' (పీ-4) వంటి వినూత్న కార్యక్రమాలను రూపొందించామని, అలాగే 'స్వర్ణాంధ్ర 2047' విజన్ డాక్యుమెంట్‌ను కూడా అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఆరోగ్యకరమైన, సంపన్నమైన, మరియు ఆనందకరమైన ఆంధ్రప్రదేశ్‌ను (హెల్తీ, వెల్తీ అండ్ హ్యాపీ ఏపీ) నిర్మించడమే తన సంకల్పమని, రాజధాని అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. భౌతికంగా ఇంతటి భారీ అభివృద్ధిని సాధిస్తున్నప్పటికీ.. సమాజంలో నిజమైన శాంతి, సంతోషాలు వికసించాలంటే ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మికత ఎంతో అవసరమని, అందుకే ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో తన కేంద్రాలను విస్తరించి విస్తృతంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆత్మీయంగా ఆహ్వానించారు.