హిందూ పురాణాల ప్రకారం, శివుడు ఆది అంతం లేని మహా జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన పరమ పవిత్రమైన రోజే మహాశివరాత్రి. శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజని కొందరు, శివుడు లింగాకారంలో ఆవిర్భవించిన రోజని మరికొందరు భావించే ఈ పండుగకు ఆధ్యాత్మికంగా విశేష ప్రాధాన్యత ఉంది. అయితే, ప్రతి ఏటా తిథుల హెచ్చుతగ్గుల వల్ల పండుగ తేదీ విషయంలో భక్తుల్లో కొంత అయోమయం నెలకొంటుంది. 2026 సంవత్సరానికి సంబంధించి కూడా ఫిబ్రవరి 15న జరుపుకోవాలా లేక 16నా అనే చర్చ మొదలైంది. తాజాగా పంచాంగ కర్తలు, పండితులు ఈ సందేహాలపై స్పష్టతనిచ్చారు.
శాస్త్రం ప్రకారం, మాఘ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథి అర్ధరాత్రి (నిశిత కాలం) ఏ రోజున ఉంటుందో, ఆ రోజునే మహాశివరాత్రిగా పరిగణించాలి. 2026 ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం సాయంత్రం 5:05 గంటలకు చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 16 సోమవారం సాయంత్రం 5:34 గంటల వరకు కొనసాగుతుంది. ముఖ్యంగా శివరాత్రి ఆరాధనలో అర్ధరాత్రి పూజ (లింగోద్భవ కాలం) అత్యంత కీలకం.
ఫిబ్రవరి 15 అర్ధరాత్రి సమయానికి చతుర్దశి తిథి వ్యాపించి ఉండటంతో, ఫిబ్రవరి 15 ఆదివారం రోజే మహాశివరాత్రి జరుపుకోవాలని పండితులు నిర్ధారించారు. ముహూర్తం మరియు ఉపవాస నియమాలు ఆధ్యాత్మిక పురోగతిని ఆకాంక్షించే భక్తులు ఈ రోజున కఠిన ఉపవాసం, జాగరణ పాటిస్తారు. ఈ ఏడాది పూజకు సంబంధించిన ముఖ్య సమయాలు ఇలా ఉన్నాయి.
నిశిత కాల పూజ సమయం: ఫిబ్రవరి 15 అర్ధరాత్రి 11:55 నుండి 12:56 వరకు (61 నిమిషాలు).
ఉపవాస విరమణ (పారణ): ఫిబ్రవరి 16 సోమవారం ఉదయం 6:42 నుండి మధ్యాహ్నం 3:10 గంటల మధ్య.
శివ అంటే మంగళప్రదమైనది అని అర్థం ప్రకృతి మరియు పురుషుడి కలయికకు ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. శివరాత్రి రోజున చేసే అభిషేకాలు, ఓం నమశ్శివాయ మంత్ర జపం మనసును ప్రశాంతంగా ఉంచడమే కాకుండా, అంతర్గత శక్తులను ఉత్తేజపరుస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది శివరాత్రి ఆదివారం ప్రారంభమై సోమవారంతో ముగియడం విశేషం. సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైన రోజు కావడంతో భక్తులు మరింత ఉత్సాహంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ, స్థానిక సిద్ధాంతాలు, ఆలయ సంప్రదాయాల ప్రకారం సమయాల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. కాబట్టి భక్తులు తమ ప్రాంతీయ పంచాంగాన్ని లేదా సమీప ఆలయ పూజారులను సంప్రదించి పండుగను ఆచరించడం ఉత్తమం.