పాత ప్రేమపై సమంత ఓపెన్ స్టేట్మెంట్!
తప్పుడు నిర్ణయం నుంచి బయటపడబట్టే ఈరోజు ఇలా ఉన్నాను..
మహానటి నుంచి నేర్చుకున్న పాఠం..
Samantha Comments: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన గత వ్యక్తిగత జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఒకప్పుడు తాను ఒక వ్యక్తితో ఉన్న గాఢమైన ప్రేమ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ.. ఆ బంధం నుంచి బయటపడకపోయి ఉంటే తన జీవితం కూడా దివంగత నటి సావిత్రి జీవితంలా విషాదకరంగా ముగిసేదని ఆమె చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. 'మహానటి' సినిమాలో నటించిన తర్వాత సావిత్రి జీవితంలోని ఒడిదుడుకులను చూసి తాను ఈ విషయాన్ని గ్రహించినట్లు సమంత పేర్కొన్నారు.
సమంత కెరీర్ ప్రారంభంలో ఒక హీరోతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో తాను సదరు వ్యక్తిని గుడ్డిగా నమ్మానని, అయితే ఏదో ఒక దశలో ఆ బంధం సరైనది కాదని గ్రహించానని ఆమె వివరించారు. "సావిత్రి గారి జీవితంలో ప్రేమ, నమ్మకం ఆమెను ఎలా ఇబ్బందుల్లోకి నెట్టాయో చూశాక నాకు భయం వేసింది. నేను కూడా దాదాపు అదే దారిలో వెళ్లాను. కానీ అదృష్టవశాత్తూ తృటిలో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాను. లేదంటే నా కథ కూడా మరో సావిత్రి బయోపిక్ అయ్యేది" అని సమంత భావోద్వేగానికి లోనయ్యారు.
ప్రేమలో మోసపోవడం లేదా తప్పుడు వ్యక్తిని ఎంచుకోవడం ఒక మహిళ జీవితాన్ని ఎంతటి అంధకారంలోకి నెడుతుందో సావిత్రి జీవితం తనకు పాఠం నేర్పిందని సమంత తెలిపారు. ఆ చేదు అనుభవం నుంచి బయటపడటం వల్లే తాను మళ్ళీ తన కెరీర్‌పై దృష్టి పెట్టగలిగానని ఆమె వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు సమంత పాత ఇంటర్వ్యూకి సంబంధించినవైనప్పటికీ, ప్రస్తుతం ఆమె విడాకుల తర్వాత మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
సమంత చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిని సరిదిద్దుకోవడానికి ధైర్యం కావాలని, సమంత ఆ ధైర్యం చేసి తనను తాను కాపాడుకుందని కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా, ఒక అగ్ర నటి తన వ్యక్తిగత జీవితంలోని చీకటి కోణాలను ఇంత బహిరంగంగా పంచుకోవడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.