మొబైల్ ఫోన్ ద్వారా 2035 సంవత్సరానికి టైమ్ ట్రావెల్..
కోల్పోయిన ప్రేమను వెతికే ప్రయత్నంలో..
తమిళ సినీ పరిశ్రమలో కొత్త కాన్సెప్ట్లతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (Love Insurance Kompany) అనే సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రేపు అనగా ఏప్రిల్ 10, 2026న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. మొదటగా 2025 సెప్టెంబర్లో విడుదల చేయాలని భావించినా, పలు కారణాలతో వాయిదా పడుతూ ఇప్పుడు రిలీజ్కు సిద్ధమైంది.
ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan), S. J. సూర్య, కృతీ శెట్టి (Krithi Shetty) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే యోగి బాబు, సీమన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సినిమా విడుదలకు ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కృతి శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హీరో ప్రదీప్ రంగనాథన్ నటన గురించి మాట్లాడుతూ… అతనిలో ఒక ప్రత్యేకమైన “మ్యాజిక్” ఉందని చెప్పింది. నటిగా తానే సినిమా చూస్తున్నప్పుడు కూడా అతని నటనపై ఆకర్షితురాలినయ్యానని తెలిపింది. అతనిలో ఉన్న “ఫైర్” మరియు కష్టపడే తత్వం ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తాయని చెప్పింది.
ఈ సినిమా కథ పూర్తిగా కొత్తగా ఉండబోతోంది. ఒక యువకుడు భవిష్యత్తు టెక్నాలజీతో కూడిన మొబైల్ ఫోన్ ద్వారా 2035 సంవత్సరానికి ప్రయాణిస్తాడు. తన కోల్పోయిన ప్రేమను వెతుక్కోవడమే అతని లక్ష్యం.
ఆ ప్రయాణంలో అతను ఒక “లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ”ని కనుగొంటాడు. అక్కడ ప్రేమ, సంబంధాలు అన్నీ ఇన్సూరెన్స్ పాలసీల మాదిరిగా నిర్వహించబడతాయి. క్లెయిమ్స్, షరతులు, బ్రేకప్ సెటిల్మెంట్స్ తో కథ సాగుతుంది. ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం మన జీవితంలో మొబైల్ ఫోన్ ఎంత ముఖ్యమైందో అందరికీ తెలుసు. అదే అంశాన్ని ఈ సినిమా తీసుకుని, మరింత భవిష్యత్తు కోణంలో అతిశయోక్తిగా చూపించనుంది. ఈ కాన్సెప్ట్ కథకు ప్రధాన బలం అని కృతి శెట్టి తెలిపింది.
ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ (Rowdy Pictures), సెవెన్ స్క్రీన్ స్టూడియో (Seven Screen Studio) నిర్మిస్తున్నాయి. ప్రముఖ నటి నయనతార ఈ ప్రాజెక్ట్ లో నిర్మాత కూడా.
సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) అందించగా, సినిమాటోగ్రఫీని రవి వర్మన్ మరియు సత్యన్ సూర్యన్ నిర్వహించారు. ఎడిటింగ్ బాధ్యతలను ప్రదీప్ ఈ. రాఘవ్ చేపట్టారు.
తమిళనాడులో ఈ సినిమాను రెడ్ జెయింట్ మూవీస్ (Red Giant Movies) విడుదల చేయనుంది. రొమాన్స్, కామెడీ, సైన్స్ ఫిక్షన్ మేళవింపుగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మొత్తానికి, లవ్ ఇన్షూరెన్స్ కంపెనీ ఒక వినూత్న కథతో, భవిష్యత్తు నేపథ్యంతో వస్తున్న ప్రత్యేక సినిమా. కృతి శెట్టి చెప్పిన విషయాలు చూస్తే… ఇందులో నటన, కథ, కాన్సెప్ట్ అన్నీ కొత్తదనం కలిగినవిగా కనిపిస్తున్నాయి. ప్రేక్షకులు థియేటర్లలో ఈ సినిమా ఎలా స్వీకరిస్తారో చూడాలి.