10 నిమిషాల ఆన్‌లైన్ డెలివరీ (10 minute deliveries) విధానాన్ని పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గిగ్ వర్కర్ల (Gig workers) నుంచి వచ్చిన నిరసనలు, భద్రతా ఆందోళనలు, పని ఒత్తిడి ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. గత కొంతకాలంగా బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, డన్‌జో వంటి క్విక్ కామర్స్ సంస్థలు 10 నిమిషాల్లో డెలివరీ అనే ప్రచారంతో వేగంగా విస్తరిస్తున్నాయి.
అయితే ఈ అతి వేగ డెలివరీ విధానం డెలివరీ బాయ్స్‌పై తీవ్ర ఒత్తిడిని పెంచుతూ, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. గిగ్ వర్కర్లు తక్కువ వేతనాలు, సమయ పరిమితులు, ఇన్సెంటివ్ కోసం ప్రాణాలకు తెగించి వాహనాలు నడపాల్సిన పరిస్థితి ఉందని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది ప్రారంభానికి ముందే గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న కేంద్రం, 10 నిమిషాల డెలివరీ విధానాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.
అలాగే, (10 minute delivery) అనే తరహా యాడ్స్, ప్రచారాలు ఇకపై ఇవ్వకూడదని క్విక్ కామర్స్ సంస్థలకు స్పష్టమైన సూచనలు జారీ చేసింది. ప్రజల్లో అతి వేగ సేవలపై అవాస్తవ అంచనాలు పెంచి, డెలివరీ వర్కర్లపై ఒత్తిడి పెరిగేలా చేసే ప్రకటనలను నియంత్రించాల్సిన అవసరం ఉందని కేంద్రం అభిప్రాయపడింది. ఇకపై సంస్థలు సురక్షిత డెలివరీ టైమ్‌లైన్‌ను పాటించాల్సి ఉంటుంది. గిగ్ వర్కర్లకు కనీస వేతనం, బీమా సౌకర్యం, ఆరోగ్య భద్రత, పని గంటల పరిమితి వంటి అంశాలపై కొత్త మార్గదర్శకాలను కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఈ నిర్ణయం వల్ల క్విక్ కామర్స్ రంగంలో పెద్ద మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. వినియోగదారులు ఇప్పటివరకు అలవాటు పడిన అతి వేగ డెలివరీకి బదులు, కొంచెం ఎక్కువ సమయం తీసుకునే కానీ సురక్షితమైన సేవలకు అలవాటు పడాల్సి ఉంటుంది. మరోవైపు, డెలివరీ వర్కర్లకు పని ఒత్తిడి తగ్గి, రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా ఈ చర్య గిగ్ వర్కర్ల హక్కుల పరిరక్షణ దిశగా కేంద్రం తీసుకున్న కీలక అడుగుగా భావిస్తున్నారు.