జగిత్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడు సౌదీ అరేబియాలో చిక్కుకుపోయాడు. ఎనిమిదేళ్లుగా అక్కడ కష్టపడుతూ ఉన్న ఈ ప్రవాసి, ఇప్పుడు మత్లూబ్ కేసులో ఇరుక్కుపోయి స్వదేశానికి తిరిగి రాలేకపోతున్నాడు.
ఏం జరిగింది?
బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామానికి చెందిన గాజుల శ్రీనివాస్ 2017లో ఆజాద్ వీసాపై సౌదీకి వెళ్లాడు. మొదట పనులు సవ్యంగా సాగినా కొంతకాలం తర్వాత సమస్యలు మొదలయ్యాయి. ఇటీవల ఆయన యజమాని, 12 వేల సౌదీ రియాళ్లు (దాదాపు ₹2.8 లక్షలు) దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేయడంతో శ్రీనివాస్‌పై మత్లూబ్ (Wanted by Police) కేసు నమోదైంది.
దీంతో ఆయనకు ఫైనల్ ఎగ్జిట్ (దేశం విడిచి వెళ్లే అనుమతి) రాకుండా ఆగిపోయింది. ఫలితంగా రియాద్‌లోనే ఉండిపోయాడు.
కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలు
శ్రీనివాస్‌కు బీపీ, నరాల సమస్యలతో ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయన కుమారుడు గాజుల సాయికిరణ్ హైదరాబాద్‌లోని సీఎం ప్రవాసీ ప్రజావాణి కార్యాక్రమంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించాడు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రతినిధి మహ్మద్ బషీర్ అహ్మద్ లు కుటుంబానికి మద్దతుగా ఉన్నారు.
శ్రీనివాస్ ఇప్పటికే రెండు సార్లు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేసినప్పటికీ, కేసు తొలగించకపోవడంతో ఆయన తిరిగి రావడం సాధ్యపడలేదు.
నా తండ్రి ఆరోగ్యంగా లేరు. దయచేసి ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆయనను భారత్‌కు తీసుకురావడంలో సహాయం చేయాలి అని గాజుల సాయికిరణ్ అభ్యర్థించారు.
సౌదీ చట్టాల్లో హురూబ్, మత్లూబ్ అంటే?
సౌదీ చట్టాల ప్రకారం యజమానికి చెప్పకుండా ఉద్యోగి పనికి రాకపోతే లేదా పారిపోతే దానిని హురూబ్ అంటారు. అలా ఫిర్యాదు చేస్తే ఆ ఉద్యోగిని పారిపోయిన కార్మికుడు గా గుర్తిస్తారు.
కొంతమంది యజమానులు ఉద్యోగులపై దురుద్దేశపూర్వకంగా మత్లూబ్ అంటే పోలీస్ కేసులు నమోదు చేస్తారు దొంగతనం ఆస్తి నష్టం వంటి కారణాలతో. ఈ వ్యవస్థను కొందరు కఫీలు (స్పాన్సర్లు) కార్మికులను బంధించడానికి ఉపయోగిస్తారు.
మత్లూబ్ కేసులో చిక్కుకున్నవారికి రెండు మార్గాలే ఉంటాయి.
1 యజమాని ఫిర్యాదు వెనక్కి తీసుకోవడం
2 లేదా పోలీసులకు లొంగిపోయి న్యాయపోరాటం చేయడం
రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, జిద్దా కాన్సులేట్ ఈ తరహా కేసుల్లో లీగల్ ఎయిడ్ (న్యాయ సహాయం) అందిస్తాయి. కానీ అక్కడి చట్టపరమైన ప్రక్రియలు సంక్లిష్టంగా ఉండటంతో సాధారణ కార్మికులు పోరాడటం కష్టసాధ్యమవుతోంది.