దేశవ్యాప్తంగా వీధికుక్కలు, రహదారులపై తిరిగే పశువుల నియంత్రణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఆసుపత్రులు వంటి ప్రజాస్థలాల్లో కుక్కకాటు ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇలాంటి ప్రాంగణాలను పూర్తిగా వీధికుక్కల రహిత ప్రాంతాలుగా మార్చాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు ఈ సమస్యపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించింది. డ్రైవ్ పురోగతిపై 8 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని సూచించింది. వీధికుక్కలను పట్టుకున్న తర్వాత వాటిని తిరిగి వదిలివేయకూడదని, వాటి సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఈ ఏడాది ఆగస్టు 11న జస్టిస్ పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ నేతృత్వంలోని బెంచ్ కుక్కల దాడులపై సీరియస్‌గా స్పందించింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్ ప్రాంతాల్లో వీధికుక్కలను షెల్టర్ హోమ్స్‌కే పరిమితం చేయాలని ఆదేశించింది. అయితే, జంతు ప్రేమికులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాన న్యాయమూర్తి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దాంతో జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియా నేతృత్వంలోని కొత్త ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రజా ప్రాంగణాల్లో, సంస్థాగత ప్రాంతాల్లో కుక్కకాటు కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త ఆదేశాలు వెలువరించింది.
అదేవిధంగా, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై విచ్చలవిడిగా తిరుగుతున్న పశువుల వల్ల ప్రమాదాలు అధికమవుతున్నాయని సుప్రీం వ్యాఖ్యానించింది. రోడ్లపై ఉన్న పశువులను పట్టుకుని షెల్టర్ హోమ్స్‌కు తరలించాలని, వాటి సంరక్షణ, ఆహారం, వసతి వంటి అంశాలను ప్రభుత్వం పర్యవేక్షించాలంటూ స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (NHAI) తప్పనిసరిగా అమలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
కుక్కకాట్ల కారణంగా భారతదేశం అంతర్జాతీయంగా ప్రతిష్ట కోల్పోతోందని సుప్రీం విచారం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకూ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించాయని విమర్శిస్తూ, ఇకపై అలాంటి నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించింది. ప్రజల భద్రత అత్యంత ప్రాధాన్యమని గుర్తుచేసిన కోర్టు, 8 వారాల్లో దేశవ్యాప్తంగా వీధికుక్కల సమస్యపై పూర్తి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన గడువు విధించింది. ఈ స్పెషల్ డ్రైవ్ విజయవంతమైతే, రాబోయే రోజుల్లో వీధికుక్కలు, రోడ్లపై తిరిగే పశువుల సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.