ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత విపరీత వేగంతో అభివృద్ధి చెందుతుండటంతో, దాన్ని దుర్వినియోగం చేసే సైబర్ నేరగాళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. గూగుల్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ బృందం తాజా నివేదికలో, నకిలీ ఉద్యోగ ప్రకటనలు, తప్పుడు వ్యాపార వెబ్సైట్లు, మోసపూరిత మొబైల్ యాప్‌లు వేగంగా విస్తరిస్తున్నాయని హెచ్చరించింది. ముఖ్యంగా పండుగ సీజన్ షాపింగ్, సంవత్సరం చివరి ఉద్యోగ సెర్చ్ సమయాల్లో ప్రజలు ఎక్కువగా మోసపోతున్నారని గూగుల్ వెల్లడించింది.
గూగుల్ వివరాల ప్రకారం, మోసగాళ్లు AI సాంకేతికతను వినియోగిస్తూ నిజమైన కంపెనీల బ్రాండింగ్, లోగోలు, వెబ్డిజైన్లను అచ్చం కాపీ చేసి నకిలీ ప్రకటనలు, యాప్‌లు, వెబ్సైట్లు తయారు చేస్తున్నారు. ఇవి నిజమైన సంస్థల వలె కనిపించడం వల్ల ఉద్యోగార్థులు, చిన్న వ్యాపారులు పెద్ద మొత్తంలో మోసపోతున్నారు. నకిలీ రిక్రూటర్లు అధికారిక సంస్థల పేరుతో వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం సేకరించి, “ప్రాసెసింగ్ ఫీజు” పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఇంకా కొంతమంది మోసగాళ్లు “ఇంటర్వ్యూ సాఫ్ట్వేర్” పేరిట వైరస్ లేదా స్పైవేర్ ఫైళ్లు పంపి అభ్యర్థుల వ్యక్తిగత సమాచారాన్ని దోచుకుంటున్నారని గూగుల్ హెచ్చరించింది. నిజమైన కంపెనీలు ఎప్పుడూ ఉద్యోగాల కోసం డబ్బులు అడగవని, లేదా బ్యాంకు వివరాలు కోరవని ప్రజలకు గుర్తు చేసింది. అలాగే వ్యాపార పేజీలను కూడా టార్గెట్ చేస్తూ, మోసగాళ్లు సింగిల్ స్టార్ రివ్యూలు ఇచ్చి ప్రతిష్ఠను దెబ్బతీస్తూ, ఆ రివ్యూలను తొలగించడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్న ఘటనలు నమోదవుతున్నాయని తెలిపింది.
ఈ తరహా సైబర్ స్కామ్‌లను నివారించేందుకు గూగుల్ పలు చర్యలు చేపట్టిందని తెలిపింది. ప్రస్తుతం సేఫ్ బ్రౌజింగ్‌లో AI ఆధారిత రక్షణలు, ప్లే స్టోర్‌లో కఠిన నియమాలు, అలాగే జీమెయిల్, గూగుల్ మెసేజ్‌లలో రియల్ టైమ్ స్కామ్ డిటెక్షన్ ఫీచర్లు అమలు చేస్తున్నట్లు వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఏదైనా అనుమానాస్పద లింక్‌లు, యాప్‌లు, లేదా రిక్రూట్మెంట్ మెయిల్స్‌ను క్లిక్ చేయవద్దని గూగుల్ సూచించింది.