రష్యాలో ఉన్నత విద్య (Higher education) కోసం వెళ్లిన ఒక భారతీయ (India) విద్యార్థి అదృశ్యం విషాదాంతంగా ముగిసింది. రాజస్థాన్ (Rajasthan) లోని అల్వార్ జిల్లాకు చెందిన అజిత్ సింగ్ చౌదరి (Ajit Singh Choudhary) (22) అనే ఎంబీబీఎస్ విద్యార్థి, 2023లో రష్యాలోని ఉఫా నగరం (Ufa city) లోని బష్కిర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ (Medical University) లో చేరాడు.
అయితే, ఈ ఏడాది అక్టోబర్ 19న ఉదయం 11 గంటలకు హాస్టల్ నుంచి పాలు కొనుక్కుని వస్తానని చెప్పి బయటకు వెళ్లిన అజిత్, అప్పటి నుంచి తిరిగి రాలేదు. 19 రోజుల పాటు కొనసాగిన గాలింపు చర్యల అనంతరం, గురువారం రోజున వైట్ నదికి సమీపంలో ఉన్న ఒక డ్యామ్‌లో అజిత్ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. నది ఒడ్డున అతని బట్టలు, మొబైల్ ఫోన్ (Mobile phone), బూట్లు లభించిన కొద్ది రోజులకే మృతదేహం (Dead body) లభ్యం కావడం ఈ ఘటనపై పలు అనుమానాలకు తావిస్తోంది.
అజిత్ మరణవార్తను రష్యాలోని భారత రాయబార కార్యాలయం గురువారం అతని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. ఈ ఘటనపై కేంద్ర మాజీ మంత్రి జితేంద్ర సింగ్ అల్వార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో ఆశలతో రష్యాకు వెళ్లిన యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం విచారకరమని ఆయన ఆవేదన చెందారు.
ఈ నేపథ్యంలో, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, అలాగే మృతదేహాన్ని త్వరగా భారత్‌కు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను కోరారు. ఈ విషాదకర ఘటనపై యూనివర్సిటీ యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.