భారత తపాలా శాఖ (India Post) ప్రజలకు సేవలను మరింత సులభతరం చేస్తూ మరో కీలక అడుగు వేసింది. సాంకేతికతను వినియోగించుకుంటూ ఆధునిక పోస్టల్ సేవలను అందించాలనే లక్ష్యంతో ‘డాక్ సేవా’ (Dak Sewa App) పేరుతో కొత్త మొబైల్ అప్లికేషన్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు వినియోగంలో ఉన్న ‘పోస్ట్ ఇన్ఫో’ యాప్‌కు బదులుగా ఈ కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తపాలా సేవలను సులభంగా, వేగంగా పొందగలరని అధికారులు తెలిపారు. తపాలా శాఖ ఆధునికీకరణలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
‘డాక్ సేవా’ యాప్‌ను సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ (CEPT) రూపకల్పన చేసింది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్లలో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సులభమైన యూజర్ ఇంటర్ఫేస్, ఆధునిక సాంకేతికతలతో ఈ యాప్‌ను రూపొందించినట్లు తపాలా శాఖ తెలిపింది. వినియోగదారులు ఈ యాప్ ద్వారా పోస్ట్ ఆఫీసుకు వెళ్లకుండానే అనేక సేవలను ఆన్లైన్లోనే పూర్తి చేసుకోవచ్చు. పోస్టల్ సేవలను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లోకి మార్చే దిశగా ఇది పెద్ద ముందడుగుగా పరిగణిస్తున్నారు.
ఈ యాప్ ద్వారా వినియోగదారులు ఎనిమిది రకాల ప్రధాన సేవలను పొందవచ్చు. స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్, పార్శిల్ ట్రాకింగ్, సమీపంలోని పోస్ట్ ఆఫీస్ వివరాలు, పనివేళలు, పోస్టేజ్ ఛార్జీలు లెక్కించడం వంటి సేవలు ఒక్కచోటే లభిస్తాయి. పార్శిల్ బరువు, గమ్యస్థానాన్ని బట్టి పోస్టేజ్ ఛార్జీలను ముందుగానే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా, పోస్టల్ ఇన్సూరెన్స్ ప్రీమియం లెక్కింపు సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఈ విధంగా వినియోగదారులు తమ రోజువారీ పోస్టల్ పనులను చాలా వేగంగా, సులభంగా పూర్తి చేయగలరు.
ఇక ఈ యాప్ ఆర్థిక సేవలను కూడా అందిస్తోంది. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (PLI), రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (RPLI) ప్రీమియంల లెక్కింపు, సుకన్య సమృద్ధి యోజన, రికరింగ్ డిపాజిట్ (RD) వంటి పొదుపు పథకాలపై వడ్డీ వివరాలు తెలుసుకునే సౌకర్యం ఉంది. కార్పొరేట్ కస్టమర్ల కోసం ప్రత్యేక సేవలను కూడా ఇందులో చేర్చారు. తపాలా శాఖ ‘పోస్టల్ సేవలు 2.0’ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తూ, ఈ యాప్ ద్వారా సేవలను డిజిటల్ యుగానికి అనుగుణంగా మార్చుతోంది. ‘డాక్ సేవా’ యాప్ ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ అవుతాయని, ఇది ‘డిజిటల్ ఇండియా’ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు.