సంక్రాంతి పండుగను స్వగ్రామాల్లో జరుపుకోవాలనే ఉత్సాహంతో వాహనదారులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి రావడంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ (Traffic) క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా యాదాద్రి జిల్లా పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద ప్రతి ఏడాది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడం సాధారణంగా మారింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ఈసారి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఒక నూతన టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. వాహనాలు ఆగకుండానే కేవలం మూడు సెకన్లలో టోల్ వసూలు చేసేలా రూపొందించిన శాటిలైట్ (Satelite) ఆధారిత ఆటోమేటిక్ టోల్ విధానాన్ని పరీక్షిస్తోంది.
ఈ క్రమంలో పంతంగి టోల్ ప్లాజా (Toll Plaza) వద్ద నిన్న సాయంత్రం ట్రయల్ రన్ నిర్వహించారు. విజయవాడ వైపు వెళ్లే ఎనిమిది టోల్ బూత్‌లలో ఈ పరీక్షలు చేపట్టారు. ఈ కొత్త విధానంలో టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన హై–రిజల్యూషన్ కెమెరాలు వాహన నంబర్ ప్లేట్‌ను గుర్తిస్తాయి. అదే సమయంలో ప్రత్యేక సెన్సార్లు ఫాస్టాగ్‌ను (fastag) స్కాన్ చేసి, వాహనం ఆగకుండానే ఆటోమేటిక్‌గా టోల్ రుసుమును ఖాతా నుంచి కట్ చేస్తాయి. దీని ద్వారా టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నిలిచే అవసరం లేకుండా ట్రాఫిక్ సాఫీగా సాగుతుందని అధికారులు భావిస్తున్నారు.
అయితే ట్రయల్ రన్ సమయంలో కొన్ని సాంకేతిక లోపాలు బయటపడ్డాయి. కొందరు వాహనదారులకు టోల్ ఫీజు సరిగ్గా కట్ కాకపోవడం, ఫాస్టాగ్ గుర్తింపులో జాప్యం జరగడం వంటి సమస్యలను అధికారులు గుర్తించారు. పండుగ రద్దీ పూర్తిస్థాయిలో మొదలయ్యేలోపు ఈ లోపాలను సరిచేయడానికి NHAI అధికారులు, టోల్ ప్లాజా సిబ్బంది యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. టెక్నాలజీ (Technology) పూర్తిస్థాయిలో విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని టోల్ ప్లాజాల వద్ద ఇదే విధానాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు.
ఇదే సమయంలో సంక్రాంతి సందర్భంగా ఊహించిన దానికంటే ఎక్కువ వాహన రద్దీ ఉండే అవకాశం ఉన్నందున విజయవాడ మార్గంలో అదనంగా మరో రెండు టోల్ బూత్‌లను తెరవాలని అధికారులు నిర్ణయించారు. ఈ బూత్‌లలో హ్యాండ్‌హెల్డ్ గన్‌లతో ఫాస్టాగ్‌లను స్కాన్ చేసి టోల్ వసూలు చేస్తారు. ఈ విధానాన్ని కూడా ట్రయల్ రన్‌లో పరీక్షించారు. ప్రస్తుతం హైదరాబాద్–విజయవాడ హైవేపై కేవలం పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రమే ఈ కొత్త టెక్నాలజీని అమలు చేస్తున్నారు. మరోవైపు జనవరి 9 నుంచి 18 వరకు టోల్ ఫీజు మినహాయింపు ఇవ్వాలంటూ తెలంగాణ ఆర్ అండ్ బీ శాఖ కేంద్రాన్ని కోరినా, కేంద్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. పండుగ సమయంలో టోల్ మినహాయింపు సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఈ కొత్త టోల్ విధానం ప్రస్తుతం ఎక్కడ అమలులో ఉంది?
ప్రస్తుతం హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజాలో మాత్రమే ఈ కొత్త టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. విజయవాడ వైపు వెళ్లే ఎనిమిది టోల్ బూత్‌లలో ట్రయల్ రన్ నిర్వహించారు.