ఆంధ్రప్రదేశ్‌లోని ఆయూష్ శాఖలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APMSRB) తాజాగా ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయవాడలోని గొల్లపూడి ప్రాంతంలో ఉన్న ఆయూష్ విభాగంలో ఔట్‌సోర్సింగ్, ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 107 పోస్టులు ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 1, 2025 నుంచి నవంబర్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాల్లో స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్, డిస్ట్రిక్ ప్రోగ్రామ్ మేనేజర్, సైకియార్టిస్ట్, ఆయూష్ డాక్టర్ (ఆయుర్వేద, హోమియోపతి, యునాని), యోగా ఇన్‌స్ట్రక్టర్ వంటి పలు పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంబీఏ, ఎంకామ్, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎండీ, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్‌వైఎస్ వంటి అర్హతలను కలిగి ఉండాలి. అదనంగా ఏపీఎంసీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అభ్యర్థుల వయస్సు మ్యానేజర్ పోస్టులకు 21 నుండి 60 ఏళ్లు, మిగతా పోస్టులకు 18 నుండి 42 ఏళ్లు ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, పీహెచ్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులు APMSRB అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు కింద ఓసీ అభ్యర్థులు రూ.1,000, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.750 చెల్లించవలసి ఉంటుంది. ఎటువంటి పరీక్షలు ఉండవు, అభ్యర్థుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
ఎంపికైన వారికి ఆకర్షణీయమైన జీతభత్యాలు అందజేస్తారు. స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్ పోస్టులకు నెలకు రూ.75,000, డిస్ట్రిక్, ఫైనాన్స్ మేనేజర్ పోస్టులకు రూ.50,000, సైకియార్టిస్ట్ పోస్టులకు రూ.15,000, ఆయూష్ డాక్టర్ పోస్టులకు రూ.40,000, యోగా ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు రూ.27,500 చొప్పున చెల్లిస్తారు. ప్రభుత్వం ఈ నియామకాలతో ఆరోగ్య రంగంలో నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.