ఒడిశాలోని నైనీ బొగ్గు గని (Naini Coal Mine) టెండర్ల విషయంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కీలక నిర్ణయం తీసుకుంది. నైనీ కోల్ మైన్స్‌కు సంబంధించిన టెండర్ల నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం పాలనాపరమైన కారణాల నేపథ్యంలో తీసుకున్నామని సింగరేణి వెల్లడించింది. ఇటీవల ఈ టెండర్లపై తీవ్ర ఆరోపణలు రావడం, వివాదాలు చెలరేగడం నేపథ్యంలో ఈ ప్రకటన రాజకీయంగా, పరిపాలనాపరంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
నైనీ కోల్ మైన్స్ టెండర్లపై అవినీతి ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, గనుల శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఇప్పటికే స్పందించారు. టెండర్ల ప్రక్రియపై వచ్చిన ఆరోపణలను సీరియస్‌గా పరిగణలోకి తీసుకున్నామని, పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి అవసరమైన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. అదే క్రమంలో, టెండర్లను రద్దు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క ఇటీవల వెల్లడించగా, తాజాగా సింగరేణి అధికారికంగా నోటిఫికేషన్‌ను క్యాన్సిల్ చేసింది.
షెడ్యూల్ ప్రకారం నైనీ బొగ్గు గని టెండర్ల బిడ్డింగ్ ప్రక్రియ ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, బిడ్డింగ్ ప్రారంభానికి ముందే టెండర్లను రద్దు చేస్తున్నట్లు ఎస్సీసీఎల్ ప్రకటించడం గమనార్హం. టెండర్లపై ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, పూర్తి స్థాయి పారదర్శకతతో ముందుకెళ్లాలని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం గనుల రంగంలో చర్చనీయాంశంగా మారింది.
ఇదే సమయంలో, నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ కూడా సింగరేణి పాలకమండలిని ప్రశ్నించింది. టెండర్ల విషయంలో ఎందుకు అవినీతి ఆరోపణలు వస్తున్నాయి? సైట్ విజిట్ ధృవీకరణ పత్రాలు ఎందుకు జారీ చేయడం లేదని కేంద్ర సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్ నిలదీశారు. దీనికి సింగరేణి అధికారులు స్పందిస్తూ, టెండర్ల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని, నిబంధనలు, టెండర్ షరతులపై పాలకమండలిలో చర్చించి మరోసారి స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని వివరణ ఇచ్చారు. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనన్న ఆసక్తి పెరుగుతోంది.