కృష్ణా జిల్లాలోని ఎదురుమొండి దీవుల (Edurumondi Islands) 20 వేల మంది ప్రజల ఏళ్లనాటి కల ఇన్నాళ్లకు నెరవేరనుంది. వారి చిరకాల వాంఛ అయిన ఏటిమొగ - ఎదురుమొండి బ్రిడ్జి (Etumoga - Edurumondi Bridge) నిర్మాణ ప్రక్రియకు ఇప్పుడు వేగం పుంజుకోనుంది.
ఈ ముఖ్యమైన అంశం మీద ఏపీ ఉప ముఖ్యమంత్రి (AP Deputy CM) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రత్యేకంగా దృష్టి సారించారు. బుధవారం రోజున మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధి మరియు తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని పంట నష్టం అంచనాలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి (Vallabhaneni Balashowry), ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మరియు అధికారులు పాల్గొన్నారు.
ఎదురుమొండి ప్రజల జీవితాలను మార్చేయబోయే ఈ హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన ముఖ్య వివరాలను పవన్ కళ్యాణ్ తెలిపారు. కృష్ణా నదిపై నిర్మించనున్న ఈ బ్రిడ్జి కోసం ఇప్పటికే నాబార్డు నుంచి రూ. 109 కోట్లు మంజూరయ్యాయని ఆయన తెలిపారు.
అలైన్‌మెంట్‌లో మార్పులు చేయడం వల్ల నిర్మాణ వ్యయం పెరిగిందని, అదనంగా రూ. 60 కోట్లు వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ అదనపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు సాస్కీ నిధులు సమకూర్చనున్నట్లు వివరించారు.
నిర్ణీత వ్యవధిలోనే ఏటిమొగ – ఎదురుమొండి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ బ్రిడ్జి పూర్తయితే దీవుల ప్రజలు ప్రధాన భూభాగంతో కనెక్ట్ అవుతారు, వారి కష్టాలు చాలావరకు తగ్గుతాయి.
మొంథా తుపాను (Montha cyclone) కారణంగా రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంత గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నష్టపోయిన వారిలో కౌలు రైతులు కూడా ఉన్నారని పవన్ కళ్యాణ్ గుర్తించారు. నష్టపోయిన ప్రతి కౌలు రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
సీసీఆర్సీ కార్డులు లేని కౌలు రైతులు కూడా చాలామంది ఉన్నారని, నష్టపోయిన ప్రతి కౌలు రైతుని గుర్తించి, వారికి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని తీర ప్రాంతంలో ముంపు సమస్య పై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు.
వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అక్కడ నిర్మించిన అవుట్ ఫాల్ స్లూయిజ్‌లు పనిచేయకుండా పోయాయని ఆయన విమర్శించారు. దీని వల్ల నాగాయలంక, కోడూరు మండలాల పరిధిలో సుమారు 5 వేల ఎకరాలు ముంపుకు గురవుతున్నాయని తెలిపారు.
వైసీపీ నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు అవుట్ ఫాల్ స్లూయిజ్‌ల పునరుద్ధరణకు ప్రస్తుత ప్రభుత్వం రూ. 50 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందని వివరించారు. ఈ నిర్మాణాలకు జాతీయ విపత్తుల నిర్వహణ నిధుల నుంచి కేటాయింపులు చేసి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కూడా కలుస్తానని తెలిపారు.
ఎదురుమొండి దీవుల పరిధిలో ఎదురుమొండి - గొల్లమంద మధ్య రహదారి నిర్మాణానికి కూడా పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ. 13.88 కోట్లు కేటాయించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయినా, అటవీ శాఖ భూభాగంలో కొంత భాగం ఉండటం వల్ల అనుమతులు నిలిచిపోయాయని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించాలని పవన్ కళ్యాణ్ అధికారులను సూచించారు.
ఇక, కృష్ణా నది సముద్రంలో కలిసే హంసలదీవి పవిత్ర సాగర సంగమం ప్రాంతానికి భక్తులు వెళ్లేందుకు అటవీ శాఖ రుసుము వసూలు చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ అంశంపై అటవీశాఖ అధికారులు (Forest Department officials) ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.