రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచే దిశగా అమెరికా మరో కీలక అడుగు వేసేందుకు సిద్ధమవుతోంది. రష్యా చమురుపై కఠిన ఆంక్షలు విధించే కొత్త బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ బిల్లు అమలులోకి వస్తే, రష్యా నుంచి చమురు దిగుమతులు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధించే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా సుంకాలను ఏకంగా 500 శాతం వరకు పెంచే ప్రతిపాదన ఉండటం గమనార్హం.
ఈ పరిణామాలను అమెరికా సీనియర్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ (Lindsey Graham) బహిరంగంగా వెల్లడించారు. అధ్యక్షుడు ట్రంప్‌తో ఇటీవల జరిగిన కీలక సమావేశం తర్వాత ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు రూపొందించిన ఈ ఆంక్షల బిల్లుకు ద్వైపాక్షిక మద్దతు లభిస్తోందని చెప్పారు. డెమోక్రాట్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెన్‌థాల్‌తో కలిసి తాను ఈ బిల్లుపై పని చేస్తున్నానని, సరైన సమయంలోనే దీనిని ముందుకు తీసుకువస్తున్నామని గ్రాహమ్ పేర్కొన్నారు.
ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించిన గ్రాహమ్, శాంతి చర్చలు కొనసాగుతున్నప్పటికీ రష్యా అధ్యక్షుడు వాగ్దానాలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. నిరపరాధుల ప్రాణనష్టం కొనసాగుతుండటానికి కారణం రష్యా యుద్ధ యంత్రాంగమేనని, దానికి చౌకగా లభిస్తున్న చమురు ప్రధాన ఇంధనమని వ్యాఖ్యానించారు. రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తూ ఆ దేశానికి ఆర్థిక బలం చేకూరుస్తున్న దేశాలపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై ఈ బిల్లు ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పారు.
అమెరికా కాంగ్రెస్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం, ఈ ప్రతిపాదిత చట్టానికి “సాంక్షనింగ్ ఆఫ్ రష్యా యాక్ట్–2025” అనే పేరు పెట్టారు. ఈ చట్టం కేవలం రష్యాపై మాత్రమే కాకుండా, రష్యాతో వ్యాపారం చేసే వ్యక్తులు, సంస్థలపై కూడా ఆంక్షలు విధించేలా రూపొందించారు. ముఖ్యంగా రష్యా నుంచి దిగుమతి అయ్యే వస్తువులు, సేవలపై కనీసం 500 శాతం వరకు కస్టమ్స్ డ్యూటీ విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి కల్పించనున్నారు.
భారత్–అమెరికా మధ్య చమురు దిగుమతులు, టారిఫ్‌ల అంశంపై ఇప్పటికే కొంత ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల అమెరికాలో జరిగిన ఒక సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోదీ టారిఫ్‌ల విషయంలో అసంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల కారణంగా భారత్‌పై అధిక టారిఫ్‌లు విధించాల్సి వచ్చిందని, అయితే భారత్ కొంతవరకు వాటిని తగ్గించిందని ఆయన చెప్పారు. అవసరమైతే భారతీయ ఉత్పత్తులపై మరింత సుంకాలు పెంచే అవకాశం ఉందన్న సంకేతాలూ ఇచ్చారు.
ఈ పరిణామాల మధ్య, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్‌స్కీ అమెరికా ప్రతినిధి బృందాన్ని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, ఆర్థిక ఆంక్షల అంశం అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా తీసుకునే తుది నిర్ణయం భారత్ వంటి దేశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది రాబోయే రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది.