ఇరాన్‌లో కొనసాగుతున్న అశాంతి పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ విషయంలో అమెరికా అన్ని మార్గాలను పరిశీలిస్తోందని, అవసరమైతే సైనిక చర్యలకు కూడా వెనకాడబోమని వైట్ హౌస్ స్పష్టం చేసింది. అయితే అదే సమయంలో దౌత్య మార్గమే తమ తొలి ప్రాధాన్యత అని కూడా ట్రంప్ పరిపాలన మరోసారి తెలియజేసింది.
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ (White House statement) కరోలిన్ లీవిట్ మీడియాతో మాట్లాడుతూ, అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడూ అన్ని అవకాశాలను తెరిచి ఉంచుతారని అన్నారు. ఇరాన్‌లో నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, అవసరమైతే సైనిక చర్యలు కూడా పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. అయితే ట్రంప్ ఎప్పుడూ ముందుగా దౌత్య మార్గానికే ప్రాధాన్యం ఇస్తారని స్పష్టం చేశారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే దృక్పథంతోనే అధ్యక్షుడు ముందుకు వెళ్తారని ఆమె తెలిపారు.
ఇరాన్ ప్రభుత్వ( Iran unrest) బహిరంగ ప్రకటనలు ఒకలా ఉండగా, గోప్యంగా అమెరికాకు చేరుతున్న సందేశాలు మరోలా ఉన్నాయని ట్రంప్ ఇటీవలే చెప్పారని లీవిట్ గుర్తు చేశారు. ఆ గోప్య సందేశాల్లో ఏముందో తెలుసుకునేందుకు అధ్యక్షుడు ఆసక్తిగా ఉన్నారని, వాటిని పరిశీలించిన తర్వాతే తదుపరి నిర్ణయాలు తీసుకుంటారని ఆమె వ్యాఖ్యానించారు. అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకునే విషయంలో ట్రంప్ ఎలాంటి భయపడటం లేదని, ఈ విషయం ఇరాన్‌కు కూడా బాగా తెలుసని ఆమె అన్నారు.
ఇదిలా ఉండగా, ఇరాన్‌లో పలు ప్రావిన్సుల్లో భారీ ప్రదర్శనలు జరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. అజర్‌బైజాన్ ప్రావిన్స్‌తో పాటు అరాక్ వంటి ప్రధాన నగరాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం, ఆర్థిక ఇబ్బందులు, పాలనపై అసంతృప్తి కారణంగా ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. కొన్ని చోట్ల ప్రభుత్వానికి మద్దతుగా, మరికొన్ని చోట్ల ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ర్యాలీలు జరిగాయని సమాచారం.
మానవ హక్కుల సంస్థల ప్రకారం, ఇటీవల జరిగిన అల్లర్లలో ఇప్పటివరకు వందల మంది మరణించగా, వేల మందిని అరెస్టు చేసి జైళ్లకు తరలించారు. ఈ పరిస్థితులపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు, ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయీ స్పందిస్తూ, తమ దేశంపై ఎలాంటి దాడి జరిగినా ప్రతిఘటించేందుకు సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. దేశ భౌగోళిక సమగ్రతను కాపాడేందుకు ప్రజలంతా ఏకతాటిపై నిలుస్తారని ఆయన అన్నారు.
ఇరాన్‌లో (US Iran tension) జరుగుతున్న అశాంతికి విదేశీ జోక్యమే కారణమని బఘాయీ ఆరోపించారు. అమెరికా, ఇజ్రాయెల్ నేతల వ్యాఖ్యల వల్లే ఈ అల్లర్లు చెలరేగాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ పరిణామాలు మధ్యప్రాచ్యంతో పాటు ప్రపంచ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా తీసుకునే తదుపరి నిర్ణయాలపై ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.