సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి లోకేశ్ ఇవాళ ఎవర్ వోల్ట్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ సైమన్ టాన్ ను కలుసుకున్నారు. ఈ భేటీలో పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులపై చర్చించారు.
లోకేశ్ మాట్లాడుతూ, "2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలన్నదే మా లక్ష్యం. అందుకోసమే ‘ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ–2024’ ను తీసుకొచ్చాం. ఇప్పటికే రెన్యూ, సుజలాన్ వంటి ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించాయి. ఏపీలో భారీ స్థాయిలో సోలార్ సెల్స్, మాడ్యూల్స్, బ్యాటరీ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నాం" అని వివరించారు.
అలాగే, రాష్ట్రంలో అధునాతన సోలార్ ఎనర్జీ నిల్వ సాంకేతికత అభివృద్ధికి ఎవర్ వోల్ట్ ఆర్అండ్‌డీ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే కాలంలో అవసరమయ్యే నిపుణుల కోసం రాష్ట్రంలోని ఐటీఐలలో రెన్యువబుల్ ఎనర్జీపై ప్రత్యేక స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ కల్పించాలని కోరారు.
ఈ సందర్భంగా స్పందించిన సైమన్ టాన్, "ఏపీ ప్రభుత్వం ఎంపికచేసిన ఐటీఐలో ప్రత్యేక నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం" అని హామీ ఇచ్చారు. బెంగుళూరును ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఎవర్ వోల్ట్, సోలార్ సెల్స్, మాడ్యూల్స్, రూఫ్‌టాప్ సొల్యూషన్స్, ఎనర్జీ స్టోరేజ్ రంగాల్లో ప్రత్యేకత కలిగిన సంస్థగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం 1 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఉన్న సంస్థ, 2026 నాటికి 3 గిగావాట్ల సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని చెప్పారు.
చివరిగా, ఏపీలో యూనిట్ ఏర్పాటుపై తమ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని సైమన్ టాన్ తెలిపారు.