బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్‌జేడీ పార్టీ అంతర్గతంగా ఉద్రిక్తతలు ఉధృతమవుతున్నాయి. పార్టీ అధినేత *లాలూ ప్రసాద్ యాదవ్ కొంతమంది నేతలకు టికెట్లు కేటాయించగా, ఆయన కుమారుడు సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ వాటిని రద్దు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ లోపల నాయకత్వం ఎవరిదన్న ప్రశ్న మళ్లీ ముందుకు వచ్చింది.
ఢిల్లీ కోర్టు విచారణ ముగించుకుని పట్నాకు చేరుకున్న లాలూ, తన పాత అనుచరులతో భేటీ అయి అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఆయన నిర్ణయంపై తేజస్వి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మిత్రపక్షాలతో సీట్ల బేరసారాలు ఇంకా పూర్తికాకముందే టికెట్లు కేటాయించడం వ్యూహపరమైన తప్పిదమని తేజస్వి అభిప్రాయపడ్డారు. దీంతో రాత్రి సమావేశంలో ఆ టికెట్లు సాంకేతిక కారణాలు అంటూ వెనక్కి తీసుకోవడం జరిగింది.
విపక్ష మహాగఠ్‌బంధన్‌లో సీట్ల పంచుకోలు ఇంకా పూర్తి కాలేదు. కాంగ్రెస్ 70–75 సీట్లు కోరుతుండగా వీఐపీ పార్టీ 50 సీట్లు, ఉపముఖ్యమంత్రి పదవి డిమాండ్ చేస్తోంది. సీపీఐ, సీపీఎం 24 స్థానాల చొప్పున అడుగుతున్నాయి అయితే ఆర్‌జేడీ మాత్రం కనీసం 134 సీట్లలో పోటీ చేయాలని స్పష్టం చేసింది. ఈ తగవుల వల్ల విపక్ష కూటమి సమయానికి అభ్యర్థుల జాబితా విడుదల చేయలేకపోతుంది.
తండ్రీ–కొడుకుల మధ్య విభేదాలు బహిరంగమవడంతో ఆర్‌జేడీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. లాలూ అనుభవం, తేజస్వి యువ నాయకత్వం – ఈ రెండు మధ్య సమతౌల్యం ఎలా సాధిస్తారన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. సీట్ల కేటాయింపులో విభేదాలు కొనసాగితే, పార్టీ దెబ్బతినే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఇక పాలక ఎన్‌డీఏ కూటమి ఎన్నికల ప్రణాళికను స్పష్టంగా ముందుకు తీసుకెళ్తోంది. బీజేపీ ఇప్పటికే తొలి జాబితా విడుదల చేసి ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. సీనియర్ నేతలు, కొత్తవారికి సమాన అవకాశాలు ఇవ్వడం ద్వారా పార్టీ సమతౌల్యాన్ని కొనసాగిస్తోంది. మరోవైపు విపక్షాలు అంతర్గత విభేదాలతో తలమునకలై ఉండటంతో ఎన్‌డీఏకు ఇది రాజకీయంగా అదనపు లాభంగా మారవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.