ఆగస్ట్ 7న చేనేత కార్మికులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త అందించనున్నది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని నేత కార్మికులకు, పవర్‌లూమ్ యూనిట్లకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. చేనేత కార్మికుల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు మార్చి నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ప్రస్తుతం అర్హులైన లబ్ధిదారుల గుర్తింపుపై అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. పథకం అమలుతో రాష్ట్రంలోని సుమారు 93 వేల నేత కార్మిక కుటుంబాలు, 10,534 పవర్‌లూమ్ యూనిట్లు లబ్ధిపొందనున్నాయి.
ఈ పథకం ద్వారా నేత కార్మిక కుటుంబాలకు నెలకు రూ.950 నుంచి రూ.1,250 వరకు, పవర్‌లూమ్ యూనిట్లకు రూ.2,500 వరకు ఆర్థిక ప్రయోజనం కలగనుంది. చేనేత వృత్తి దిగజారుతున్న నేపథ్యంలో దీనికి మద్దతుగా టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జాబితా ఖరారు అనంతరం, ఆగస్ట్ 7నుంచి పథకాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.