తమిళనాడు రాజకీయాల్లో మరోసారి భారీ అవినీతి ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాటర్ సప్లై శాఖలో ఉద్యోగ నియామకాలు, బదిలీల పేరుతో వందల కోట్ల రూపాయల లంచాలు వసూలు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజా ఆధారాలతో బయటపెట్టింది. ఈ కేసులో ఏకంగా రాష్ట్ర మంత్రి కె.ఎన్. నెహ్రూ ప్రమేయం ఉందని ఈడీ ఆరోపించడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం చాలా వేగుతుంది.
ఈడీ వెల్లడించిన వివరాల ప్రకారం, మున్సిపల్ శాఖలో పోస్టింగ్‌లు, ట్రాన్స్‌ఫర్లు ఇప్పించేందుకు ఒక్కో ఉద్యోగం కోసం రూ.7 లక్షల నుంచి రూ.1 కోటి వరకు లంచాలు వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయి. ఇప్పటివరకు దాదాపు 340 మంది అధికారులకు సంబంధించిన లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. ఈ మొత్తం కుంభకోణం విలువ సుమారు రూ.366 కోట్లుగా ఈడీ అంచనా వేస్తోంది. ఇది కేవలం బయటపడిన లావాదేవీలేనని, అసలు అవినీతి పరిమాణం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశముందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు కీలకమైన వాట్సాప్ చాట్లు, ఫోటోలు, డాక్యుమెంట్లను సేకరించినట్లు తెలుస్తోంది. ఈ చాట్లలో ఉద్యోగ నియామకాలు, బదిలీల కోసం డబ్బు డిమాండ్ చేసిన వివరాలు స్పష్టంగా ఉన్నాయని సమాచారం. లంచాల రూపంలో వసూలు చేసిన సొమ్మును రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, బంగారం కొనుగోళ్లు, విదేశీ ఆస్తులు, విలాసవంతమైన ఖర్చులకు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది.
ఈ నేపథ్యంలో మంత్రి కె.ఎన్. నెహ్రూపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, అవినీతి నిరోధక శాఖకు ఈడీ అధికారిక లేఖ రాసింది. ఇప్పటికే గతంలో కూడా మున్సిపల్ శాఖకు సంబంధించిన టెండర్లు, నియామకాలపై అక్రమాలు జరిగాయని ఈడీ పలు మార్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లోనే వెయ్యి కోట్లకు పైగా అవినీతి జరిగి ఉండవచ్చని ఈడీ పేర్కొంది.
ఇప్పుడు తాజా ఆధారాలతో ఈడీ దూకుడు పెంచడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగులోకి రావడం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అధికార డీఎంకే పార్టీ ఇది కేంద్ర దర్యాప్తు సంస్థల రాజకీయ కక్ష సాధింపు అని ఆరోపిస్తుండగా, విపక్షాలు మాత్రం ఆధారాలు ఉన్నాయంటే తప్పకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.