16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో పూర్తి పారదర్శకత: మంత్రి అనిత..
240కుపైగా కోర్టు కేసులను అధిగమించి మెగా డీఎస్సీ విజయవంతం..
అమరావతి: డీఎస్సీ-2025 నియామక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించిందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఏపీ సచివాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ప్రజలకు జవాబుదారిగా ఉంటుందని తెలిపారు.
గత ప్రభుత్వం ఒక్క డీఎస్సీని కూడా పూర్తిస్థాయిలో నిర్వహించలేకపోయిందని, ఎన్నికలకు కేవలం 60 రోజుల ముందు 6,100 పోస్టులతో మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసిందని ఆమె గుర్తుచేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో మెగా డీఎస్సీ నిర్వహించి 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టిందన్నారు.
డీఎస్సీ నిర్వహించి దాదాపు ఎనిమిది, తొమ్మిది నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు దానిపై అనవసర ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అనిత వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో ఎన్నో డీఎస్సీలు విజయవంతంగా నిర్వహించారని, వాటి ద్వారా దాదాపు రెండు లక్షల మంది ఉపాధ్యాయులు ఉద్యోగాలు పొందారని చెప్పారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సుమారు 3.11 లక్షల ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 60 శాతం మంది చంద్రబాబు హయాంలోనే నియమితులయ్యారని ఆమె పేర్కొన్నారు. తాను కూడా 2001లో డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయురాలిగా ఉద్యోగంలో చేరానని, 12 సంవత్సరాలు సేవలందించిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. అందువల్ల డీఎస్సీ నోటిఫికేషన్ నుంచి పోస్టింగ్ వరకు జరిగే ప్రతి దశ గురించి తనకు పూర్తి అవగాహన ఉందన్నారు.
డీఎస్సీ-2025 నిర్వహణలో ప్రభుత్వం 240కు పైగా కోర్టు కేసులను ఎదుర్కొని, కేవలం 148 రోజుల్లోనే నియామక ప్రక్రియను పూర్తి చేయడం విశేషమని ఆమె తెలిపారు. వేలాది మంది అభ్యర్థులు కుటుంబాలకు దూరంగా ఉండి నెలల తరబడి శిక్షణ తీసుకుని పరీక్షలకు సిద్ధమవుతారని, అలాంటి అభ్యర్థుల కృషిని గౌరవిస్తూ ప్రభుత్వం అత్యంత బాధ్యతతో వ్యవహరించిందన్నారు.
మూడు దశల్లో గ్రీవెన్స్ పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసి, వచ్చిన 34 వేలకుపైగా ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించామని మంత్రి వివరించారు. టీసీఎస్ ద్వారా దాదాపు 43 వేల ప్రశ్నలను సిద్ధం చేసి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించామని చెప్పారు.
స్పోర్ట్స్ కోటా నియామకాల విషయంలో కూడా ప్రభుత్వం పూర్తి పారదర్శకత పాటించిందని అనిత తెలిపారు. మూడు శాతం రిజర్వేషన్ కింద 421 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినప్పటికీ, అర్హత కలిగిన 382 మందిని మాత్రమే ఎంపిక చేశామని చెప్పారు. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను ప్రజల పరిశీలన కోసం పబ్లిక్ డొమైన్‌లో ఉంచామని తెలిపారు.
స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల విద్యార్హతలు, క్రీడా సర్టిఫికెట్లను 15 మంది సభ్యులతో కూడిన కమిటీ పరిశీలించిందని, సంబంధిత ఫెడరేషన్లు, అసోసియేషన్ల ద్వారా ధృవీకరణ పూర్తయ్యాకే ఎంపికలు చేపట్టామని వివరించారు. బ్రిడ్జ్ క్రీడను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే పరిగణించామని, ఆ క్రీడ 2018, 2022 ఆసియా క్రీడల్లో కూడా భాగమైందని, భారత్ కాంస్య పతకం సాధించిందని గుర్తుచేశారు.
గత ప్రభుత్వం గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో అనేక వివాదాలు ఎదుర్కొని విమర్శలకు గురైందని, అలాంటి ఒక్క ఘటన అయినా చంద్రబాబు పాలనలో జరిగిందని చూపించాలని ఆమె ప్రతిపక్షాలను సవాల్ చేశారు. డీఎస్సీ-2025 ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని, ప్రభుత్వం పారదర్శకత, న్యాయం, ప్రతిభకు ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తోందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.