కూటమి ప్రభుత్వం ప్రోత్సాహంతో టెన్త్, ఇంటర్ లో అత్యుత్తమ ఫలితాలు..
2027 నాటికి మరింత మెరుగైన ఫలితాలే లక్ష్యం : మంత్రి సవిత..
విజయవాడలో జరిగిన బీసీ సంక్షేమ శాఖ అభినందన కార్యక్రమం భావోద్వేగాలకు, గర్వకారణ క్షణాలకు వేదికైంది. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఎంజేపీ గురుకులాలు, బీసీ హాస్టళ్ల విద్యార్థులను రాష్ట్ర బీసీ సంక్షేమ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత & జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ఘనంగా సత్కరించారు. విద్యార్థుల ప్రతిభను కొనియాడుతూ, బీసీ విద్యాసంస్థలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే బీసీ వెల్ఫేర్ విద్యాసంస్థలు అద్భుతమైన ఫలితాలు సాధించాయని తెలిపారు.
టెన్త్, ఇంటర్ ఫలితాల్లో బీసీ వెల్ఫేర్ రాష్ట్రంలో నెంబర్‌వన్ స్థానంలో నిలిచిందని మంత్రి గర్వంగా చెప్పారు. గతంలో బీసీ హాస్టళ్ల పరిస్థితి దయనీయంగా ఉండేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారాయని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న రూ.110 కోట్ల డైట్ బిల్లులను విడుదల చేసి విద్యార్థులకు సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు.
హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు, మస్కిటో మెష్‌లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీఎస్‌ఆర్, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్, ప్రభుత్వ నిధులతో మరమ్మతులు చేపడుతున్నామని తెలిపారు. కొత్తగా 1500 మరుగుదొడ్లు నిర్మిస్తున్నామని, త్వరలో 1291 మంది పారిశుధ్య సిబ్బందిని నియమించనున్నామని వెల్లడించారు.
ఎంజేపీ గురుకులాల శాశ్వత భవనాల నిర్మాణానికి రూ.500 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఒక్కో విద్యార్థిపై ఎంజేపీ గురుకులాల్లో రూ.1.50 లక్షలు, బీసీ హాస్టళ్లలో రూ.75 వేల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు.
విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలనే ఉద్దేశంతో త్వరలో స్పోర్ట్స్ మెటీరియల్ అందజేస్తామని చెప్పారు. వంటగదుల సామగ్రి కోసం రూ.18 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. వచ్చే ఏడాది మరో 10 కొత్త గురుకుల పాఠశాలలు ప్రారంభిస్తామని, ఆరు గురుకుల పాఠశాలలను కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు వెల్లడించారు.
“నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివాను. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు” అంటూ విద్యార్థులకు మంత్రి సవిత ప్రేరణనిచ్చారు. భవిష్యత్తులో మీలోనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వైద్యులు, ఇంజినీర్లు ఎదగాలని ఆకాంక్షించారు. సమస్యలు వచ్చినప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో మాట్లాడాలని సూచించారు.
బీసీ వెల్ఫేర్ పాఠశాలల్లో గత ఏడాది 77 శాతంగా ఉన్న ఉత్తీర్ణత ఈసారి 87 శాతానికి పెరిగిందని అధికారులు వెల్లడించారు. రెసిడెన్షియల్ స్కూల్స్ 96.4 శాతం ఫలితాలు సాధించాయని తెలిపారు. పోలవరం జిల్లా 100 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలవగా, కోనసీమ, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, వైఎస్ఆర్ కడప జిల్లాలు కూడా అద్భుత ఫలితాలు సాధించాయి.
ఈ కార్యక్రమంలో నెల్లూరుకు చెందిన విద్యార్థిని ప్రణీత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టెన్త్‌లో 589 మార్కులు సాధించిన ఆమెను మంత్రి సవిత సత్కరించారు. వేదికపై ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడిన ప్రణీత తన విజయంలో తల్లి లక్ష్మీదేవి పాత్ర ఎంతో ఉందని చెప్పడంతో సభలో భావోద్వేగ వాతావరణం నెలకొంది.
కూతురు ఇంగ్లీష్‌లో ధైర్యంగా మాట్లాడుతుండటాన్ని చూసి తల్లి లక్ష్మీదేవి ఆనందభాష్పాలు పెట్టుకున్నారు. ఈ దృశ్యం అక్కడున్న వారిని కూడా కదిలించింది. మంత్రి సవిత స్వయంగా వెళ్లి తల్లీబిడ్డను ఆలింగనం చేసుకుని అభినందించారు. “మీ బిడ్డ విజయానికి మీ కష్టం కారణం” అంటూ తల్లికి ధైర్యం చెప్పారు.
అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ, తమ విజయానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రభుత్వం అందించిన సౌకర్యాలే కారణమన్నారు. ముఖ్యంగా మంత్రి నారా లోకేశ్ ప్రవేశపెట్టిన వంద రోజుల ప్రణాళికలు తమకు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపారు. “మేం బీసీ హాస్టళ్ల విద్యార్థులం అని గర్వంగా చెబుతున్నాం” అంటూ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
టెన్త్, ఇంటర్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మంత్రి సవిత చేతుల మీదుగా మెమోంటోలు, నగదు బహుమతులు అందజేశారు. వివిధ గ్రూపుల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు నగదు ప్రోత్సాహకాలు అందించారు.
తన తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా 400 మంది విద్యార్థులకు మంత్రి సవిత ఉచితంగా స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. గత ఏడాది కూడా ఇదే విధంగా సహాయం అందించామని గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా బీసీ విద్యార్థులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
కార్యక్రమం అనంతరం మంత్రి సవిత విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసి వారితో మమేకమయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, కార్పొరేషన్ చైర్మన్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.