భారీ ఆర్థిక ప్యాకేజీతో ప్లాంట్ కార్యకలాపాలు గాడిలో..
రెండో దశలో భాగంగా మరో రూ.8,097 కోట్ల సాయం..
విశాఖపట్నం: ఆర్థిక ఇబ్బందులతో కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి చేయూత ఇవ్వడానికి ముందుకొచ్చింది. గత ఏడాది ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీతో ప్లాంట్ కార్యకలాపాలు గాడిలో పడిన నేపథ్యంలో, ఇప్పుడు రెండో దశలో భాగంగా మరో రూ.8,097 కోట్ల సాయం అందించేందుకు కేంద్రం సిద్ధమైంది.
ఈ ఆర్థిక సాయానికి సంబంధించిన ఫైల్‌ను కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామి ఇప్పటికే ఆమోదించి ఆర్థికశాఖకు పంపినట్లు సమాచారం. ఆర్థికశాఖ వ్యయ విభాగం ఆమోదం తెలిపిన వెంటనే ఈ ప్రతిపాదన కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళ్లనుంది.
ప్రస్తుతం ప్లాంట్‌లో మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లు పనిచేయడం ప్రారంభించడంతో ఉత్పత్తి స్థిరంగా కొనసాగుతోంది. ఉక్కు ఉత్పత్తి, అమ్మకాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ స్థిరత్వం దీర్ఘకాలం కొనసాగేందుకు అవసరమైన మద్దతుగా ఈ కొత్త ప్యాకేజీ ఉపయోగపడనుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
ఇప్పటికే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రంతో చర్చలు జరిపి మొదటి దశలో రూ.11,440 కోట్ల ప్యాకేజీ సాధించింది. అందులో రూ.10,300 కోట్లు ఈక్విటీగా, మరో రూ.1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ రుణాలుగా (7% నాన్ క్యుములేటివ్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ల రూపంలో) అందించారు.
ఇప్పుడు ప్రతిపాదిస్తున్న రూ.8,097 కోట్ల సాయాన్ని కూడా పూర్తిగా ఈక్విటీ రూపంలోనే ఇవ్వాలని కేంద్ర ఉక్కుశాఖ నిర్ణయించింది. దీంతో ప్లాంట్ ఆర్థికంగా మరింత బలపడే అవకాశం ఉంది.
ఈ పరిణామంతో విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై ఆశలు మరింత పెరిగాయి. ఉద్యోగులు, స్థానిక ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ప్లాంట్ మళ్లీ పూర్వ వైభవం సాధించాలని ఆశిస్తున్నారు.