బహ్రెయిన్ తెలుగు సమాజానికి తీరని లోటు..
సేవామూర్తి డి.వి. శివకుమార్‌కు కన్నీటి వీడ్కోలు..
బహ్రెయిన్: బహ్రెయిన్‌లోని తెలుగు సమాజానికి సేవలందిస్తూ అందరి గుండెల్లో స్థానం సంపాదించిన సేవామూర్తి శ్రీ డి.వి. శివకుమార్ (డౌర్ల శివకుమార్) అకాల మరణం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆయన మరణంతో తెలుగు సమాజం ఒక పెద్ద దిక్కును కోల్పోయిందనే భావన ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతోంది.
1988లో బహ్రెయిన్‌లో అడుగుపెట్టిన శివకుమార్ గారు, దాదాపు నాలుగు దశాబ్దాలుగా అక్కడి తెలుగు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేశారు. ఆయన కేవలం వ్యక్తిగత జీవితం గడిపినవారు కాదు, కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం ఇచ్చే భరోసాగా నిలిచారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నారైల కోసం ఏపీ ఎన్నార్టీ సొసైటీ స్థాపించినప్పటినుండి ఆయన బహ్రెయిన్ లో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్న తెలుగు వారికి ఎందరికో తన సేవలందించారు. ఏపీ ఎన్నార్టీ నుండి బహ్రెయిన్ కు సంబంధించిన ఎటువంటి సమస్యను అయినా తానే ముందు ఉండి ఆ సమస్యలు తీరేవరకు విశ్రాంతి తీసుకోకుండా శ్రమించి తగినటువంటి పరిష్కారం లేదా ఆ ఇబ్బందులు ఉన్నటువంటి వారిని తమ మాతృదేశానికి పంపటం వరకు దగ్గరుండి చూసుకునేవారు.
వీరి సేవలు ద్వారా ఏపీ ఎన్నార్టీ బహ్రెయిన్ కు సంబంధించిన సమస్యలు చిటికలో పరిష్కారమయ్యే విధంగా చేయగలిగేది. 2019 లో ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఎన్నారై టీడీపీ లో ఆయన అదేవిధంగా తన సహకారాన్ని అందించారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో బహ్రెయిన్ కు సంబంధించిన సమస్యలను తన టీమ్ మెంబర్ల సహకారం తీసుకొని తానే ముందుండి ఆ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేవారు. మీరు చేసిన విశేష కృషి అటు ఏపీ ఎన్నార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం ఎన్నారై టిడిపి సెల్ కు తీరని లోటు మరియు ఎప్పటికీ మరువలేనని.
ప్రత్యేకంగా కార్మికుల సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవ ప్రశంసనీయం. వేధింపులకు గురైనవారికి అండగా నిలబడి, వారికి సహాయం చేయడంలో ముందుండేవారు. తెలుగు కళా సమితిలో నాలుగు సార్లు కార్యవర్గ సభ్యుడిగా, మూడు పర్యాయాలు ఉపాధ్యక్షుడిగా సేవలందించి, సంస్థ అభివృద్ధికి విశేష కృషి చేశారు.
‘ఈజీ ఎగ్జిట్’ పథకం సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎందరో తెలుగు వారిని స్వదేశానికి సురక్షితంగా పంపడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి సహాయం అందించడం నుంచి, మరణించిన వారి మృతదేహాలను స్వగ్రామాలకు పంపించే వరకు ప్రతి పనిని తన బాధ్యతగా భావించి నిర్వర్తించారు.
ఆయన సహాయ సహకారం తెలుగు సమాజం గుండెల్లో ఎప్పటికీ మరువలేనిదని ఎన్నారై అఫైర్స్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీ ఎన్నార్టీ అధ్యక్షులు మరియు ప్రభుత్వ సలహాదారుడు రవి వేమూరి, ఎన్నారై టీడీపీ సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ అలాగే గల్ఫ్ అధ్యక్షుడు రావి రాధా కృష్ణ వెల్లడిస్తూ వీరి మృతి కి తమ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు.
బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఉద్యోగిగా పనిచేస్తూనే, తన ఖాళీ సమయాన్ని సమాజ సేవకే అంకితం చేశారు. “సేవయే పరమావధి” అనే సిద్ధాంతంతో రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తూ అనేక మందికి ప్రాణదానం చేశారు.
శివకుమార్ గారు ఇక మన మధ్య లేకపోయినా, ఆయన చేసిన సేవలు, చూపిన మార్గం తెలుగు సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయి. ఆయన మరణంపై బహ్రెయిన్ తెలుగు సమాజం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
శివకుమార్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం కలగాలని బహ్రెయిన్ తెలుగు సమాజం తరఫున రఘునాథ బాబు, హరిబాబు మరియు ఇతర సభ్యులు, మిత్రులు తమ సంతాపం తెలిపారు.
ఈ సందర్భంగా శివకుమార్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆంధ్రప్రవాసి తరపున మనస్పూర్తిగా కోరుకుంటున్నాము..