JTC కార్పొరేషన్ ను సందర్శించిన మంత్రుల బృందం..
గ్రీన్ ప్రాజెక్టులను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించిన JTC కార్పొరేషన్..
సింగపూర్: సింగపూర్‌లో జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం ప్రముఖ ప్రభుత్వ సంస్థ JTC కార్పొరేషన్‌ను సందర్శించింది. సింగపూర్ వాణిజ్య & పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సంస్థ దేశంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది.
గతంలో జురాంగ్ టౌన్ కార్పొరేషన్‌గా గుర్తింపు పొందిన JTC, పారిశ్రామిక వాడల అభివృద్ధి, ఆధునిక సాంకేతికతతో కూడిన స్మార్ట్ ఎస్టేట్ల నిర్మాణం, పర్యావరణానికి అనుకూలమైన గ్రీన్ ప్రాజెక్టుల అమలులో ముందంజలో ఉంది. ఈ సంస్థ చేపట్టిన ప్రాజెక్టులు ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయి.
ఈ సందర్భంగా JTC రిటైర్డ్ అసిస్టెంట్ సీఈవో సీ కీ పోక్ (Seah Kee Pok) మంత్రుల బృందానికి సంస్థ పురోగతి, ప్రాజెక్టుల వివరాలను ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పారిశ్రామిక అభివృద్ధిలో JTC అనుసరిస్తున్న విధానాలు, ఆధునిక సాంకేతిక వినియోగం గురించి సమగ్ర అవగాహన కల్పించారు.
ముఖ్యంగా జురాంగ్ ఐలాండ్, వన్-నార్త్, చంగీ బిజినెస్ పార్క్, పుంగోల్ డిజిటల్ డిస్ట్రిక్ట్ వంటి భారీ ప్రాజెక్టుల అభివృద్ధిలో JTC పాత్రపై మంత్రులు ఆసక్తిగా తెలుసుకున్నారు. అలాగే ఆగ్నేయాసియాలోనే మొదటిసారిగా నిర్మించిన జురాంగ్ రాక్ కేవర్న్స్ వంటి వినూత్న నిర్మాణాల గురించి కూడా వివరాలు తెలుసుకున్నారు. భూమి లోపల చమురు నిల్వ కోసం నిర్మించిన ఈ గుహలు సాంకేతికంగా ఎంతో ప్రత్యేకమైనవి.
ఈ అధ్యయనం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి పారిశ్రామిక వాడల అభివృద్ధి, స్మార్ట్ ఎస్టేట్ల నిర్మాణం, గ్రీన్ ప్రాజెక్టుల అమలుకు అవకాశాలను మంత్రులు పరిశీలించారు. రాష్ట్ర అభివృద్ధికి సింగపూర్ మోడల్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పి. నారాయణ, బి.సి. జనార్దన్ రెడ్డి, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. మొత్తం కార్యక్రమం అనుభవపూర్వకంగా సాగి, భవిష్యత్ ప్రణాళికలకు దిశానిర్దేశం చేసినట్లు మంత్రులు పేర్కొన్నారు.