గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం, రాష్ట్రం కలిసి ముందడుగు వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ రహదారుల పరిస్థితిని మార్చి కొత్త రూపు ఇవ్వాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సాస్కి (Special Assistance to States for Capital Investment) పథకం కింద రాష్ట్రానికి రూ.2 వేల కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులను సద్వినియోగం చేసి ప్రజలకు స్థిరమైన, నాణ్యమైన రహదారులు అందించడమే తమ ప్రాధాన్యం అని ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ విభాగాధికారులతో సమీక్ష నిర్వహించి, నిధుల వినియోగంపై స్పష్టమైన దిశానిర్దేశాలు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో పాడైపోయిన, దెబ్బతిన్న రోడ్ల పునర్నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదు. ప్రతి దశలో క్వాలిటీ చెక్ తప్పనిసరి. నిర్మాణం పూర్తి అయిన తర్వాత కూడా తనిఖీలు జరుగుతాయి అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
రహదారులు ప్రజల దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయని, గ్రామీణ అభివృద్ధికి రోడ్లే వెన్నెముక అని మంత్రి పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో పటిష్టమైన రహదారులు ఉండాలి. మౌలిక వసతుల కల్పనలో ఇది ప్రధాన అంశం. ఈ నిధులు కేవలం రోడ్లకే కాదు, ప్రత్యేక సందర్భాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూడా ఉపయోగించవచ్చు అని ఆయన తెలిపారు.
ప్రత్యేకంగా పుట్టపర్తి లో శ్రీ సత్య సాయిబాబా గారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలకు సాస్కి నిధుల నుండి రూ.35 కోట్లను వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ విధంగా సాస్కి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలు మాత్రమే కాదు, రాష్ట్రంలోని పలు ముఖ్య కేంద్రాలు కూడా లబ్ధి పొందనున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారం లేకుండా ఈ స్థాయి నిధులు సాధ్యమయ్యేవి కావు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం తోడ్పడుతోంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకంలో ఈ నిధులను సద్వినియోగం చేసుకుంటున్నాము అని అన్నారు.
గత ప్రభుత్వ కాలంలో రహదారుల నిర్మాణంలో అలక్ష్యం చోటుచేసుకున్నదని, కేంద్ర నిధులను పొందడంలో సరైన చొరవ చూపలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారంతో ప్రతీ గ్రామానికి మంచి రహదారులు, మెరుగైన సదుపాయాలు అందించాలనే సంకల్పంతో ఉంది అని చెప్పుకొచ్చారు