గుజరాత్‌లో నిర్వహించిన Rastriya Khanij Chintan Shivir–2026లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి అవసరమైన క్రిటికల్ మినరల్స్‌ను విదేశాలపై ఆధారపడకుండా స్వదేశంలోనే ఉత్పత్తి చేసుకునే దిశగా అడుగులు వేయాలని అన్నారు. మైనింగ్ రంగంలో ప్రపంచ దేశాలపై ఆధారపడే పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందని, ఇందుకు కేంద్రం–రాష్ట్రాలు కలిసి సమన్వయంతో పనిచేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక నిర్వహణ వ్యవస్థకు SKOCH సిల్వర్ అవార్డు రావడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. ఖనిజ వనరుల వినియోగంలో పారదర్శకత, సాంకేతికతను ప్రవేశపెట్టడం వల్లే ఈ గుర్తింపు సాధ్యమైందని తెలిపారు. దేశంలో ఉన్న ఖనిజ సంపదను సమర్థవంతంగా వినియోగించుకుంటే భారత్ మరింత శక్తివంతమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు.
ఇక పెట్టుబడుల విషయానికి వస్తే, 2025–26 ఆర్థిక సంవత్సరంలో దేశానికి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (FDI) 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కే రావడం రాష్ట్ర ప్రభుత్వంపై ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అనుకూల విధానాలు, స్థిరమైన పాలన, మౌలిక వసతుల అభివృద్ధి వల్లే పెట్టుబడిదారులు ఏపీ వైపు ఆకర్షితులవుతున్నారని ఆయన అన్నారు.