టీటీడీకి ఎలక్ట్రిక్ బస్సు బహూకరించిన నీరా రాడియా..
శ్రీవారి ఆలయం ఎదుట విద్యుత్ బస్సుకు ప్రత్యేక పూజలు..
తిరుమల శ్రీవారిపై భక్తి భావంతో ప్రముఖ పారిశ్రామికవేత్త నీరా రాడియా టీటీడీకి విద్యుత్ బస్సు, 15 యాపిల్ టాబ్స్‌ను విరాళంగా అందజేశారు. శుక్రవారం తిరుమలలో జరిగిన ఈ కార్యక్రమం భక్తి, సేవాభావాలకు ప్రతీకగా నిలిచింది. శ్రీవారి ఆలయం ఎదుట కొత్తగా అందించిన విద్యుత్ బస్సుకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బస్సు తాళాలు, యాపిల్ టాబ్స్‌ను టీటీడీ ఛైర్మన్ మరియు అదనపు ఈవో వెంకయ్యచౌదరికి నీరా రాడియా అధికారికంగా అందజేశారు.
ఈ సందర్భంగా టీటీడీ అధికారులు నీరా రాడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భక్తుల సేవలో ఆధునిక సౌకర్యాలను మరింత విస్తరించేందుకు ఈ విరాళం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యుత్ బస్సుల వినియోగం వల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని తెలిపారు.
టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి మాట్లాడుతూ ప్రస్తుతం టీటీడీ వద్ద మొత్తం 20 ధర్మరథం బస్సులు ఉన్నాయని, అందులో ఇప్పటికే 14 విద్యుత్ బస్సులు సేవలందిస్తున్నాయని వెల్లడించారు. భవిష్యత్తులో డీజిల్ బస్సుల స్థానంలో పూర్తిగా విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తిరుమలలో గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని పెంచేందుకు టీటీడీ కట్టుబడి ఉందన్నారు.
అలాగే విద్యార్థులు, అధికారుల సేవల కోసం అందించిన 15 యాపిల్ టాబ్స్ కూడా టీటీడీ పరిపాలనలో సాంకేతిక సేవలను మరింత బలోపేతం చేయనున్నాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు.