అనంతపురంలో హైటెక్ మోసం – వైసీపీ నేత ఎర్రిస్వామి అరెస్ట్..
ఖాతాలో రూ.70 లక్షల కోట్లు అంటూ మోసం..
అనంతపురం జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ABN ఆంధ్రజ్యోతి కథనంతో ఈ వ్యవహారం బయటపడగా, పోలీసులు వెంటనే చర్యలు ప్రారంభించారు.
కల్యాణదుర్గానికి చెందిన వైసీపీ నాయకుడు ఎర్రిస్వామిపై యూనియన్ బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. తన బ్యాంక్ ఖాతాలో రూ.70 లక్షల కోట్లు ఉన్నాయని చెప్పి ఎర్రిస్వామి అమాయకులను నమ్మించాడు. ఆ డబ్బును విత్డ్రా చేయడానికి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పి పలువురిని మోసం చేసినట్లు తెలుస్తోంది.
ఈ మోసంలో భాగంగా, బాధితుల నుంచి సుమారు రూ.3 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. అధిక లాభాల ఆశతో నమ్మిన ప్రజలు చివరికి మోసపోయినట్టు తెలిసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఎర్రిస్వామి వెనుక మరెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరెవరిని మోసం చేశాడన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. ప్రజలు ఇలాంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.