TDP Central Office: టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన 'ప్రజా వినతుల స్వీకరణ' కార్యక్రమం కష్టాల్లో ఉన్న సామాన్యులకు ఒక వేదికగా మారింది. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలను మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మల దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు చేసిన అరాచకాలు, భూ కబ్జాలు, అధికారుల నిర్లక్ష్యంపై బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. వచ్చిన ప్రతి అర్జీని ఓపిగ్గా పరిశీలించిన నేతలు, త్వరితగతిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ముఖ్యంగా కర్నూలు జిల్లా మంత్రాలయం మండలానికి చెందిన గంగనాయక్ అనే కార్యకర్త తన గోడును వెళ్లబోసుకున్నారు. నేను నిఖార్సైన టీడీపీ కార్యకర్తననే నెపంతో, గత వైసీపీ పాలనలో నాకు దక్కాల్సిన ఇళ్ల పట్టాను స్థానిక నేతలు అడ్డుకున్నారు. జాబితాలో పేరున్నా కేవలం రాజకీయ కక్షతో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, మరికొందరు గ్రామాల్లో ఉమ్మడి దారులను ఆక్రమించి, తప్పుడు మ్యాపులతో రౌడీయిజం చేస్తున్నారని మంత్రికి ఫిర్యాదు చేశారు.
మరోవైపు, ప్రకాశం జిల్లా వైదన గ్రామానికి చెందిన రామకృష్ణ భూ రీ-సర్వేలో జరిగిన ఘోర తప్పిదాలను ఎత్తిచూపారు. తన తాతల కాలం నాటి పట్టా భూమిని రీ-సర్వే అధికారులు రికార్డుల్లో 'అసైన్డ్' భూమిగా మార్చేశారని, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఆవేదన చెందారు. ఇలా ఒకరి భూమిని మరొకరి పేరు మీద మార్చేసి రైతులను గందరగోళానికి గురిచేస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అన్నమయ్య జిల్లాకు చెందిన మంజునాధ్ అయితే, సర్పంచ్ మరియు కార్యదర్శి కుమ్మక్కై గ్రామ పంచాయతీ నిధులను సొంత అకౌంట్లకు మళ్లించుకున్నారని సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశారు.
ఇక గుంటూరు, కృష్ణా జిల్లాల నుండి వచ్చిన బాధితులు భూ సమస్యల పరిష్కారం కోసం వేడుకున్నారు. గుంటూరుకు చెందిన హరిప్రసాద్ తన పట్టా భూమిని పొరపాటున దేవాదాయ శాఖ నిషేధిత జాబితాలో చేర్చారని, దాని వల్ల అమ్ముకోవడానికి కూడా వీలు లేకుండా పోయిందని మొరపెట్టుకున్నారు. వృద్ధురాలు జయప్రద తనకు ప్రభుత్వం ఇచ్చిన రెండు ఎకరాల భూమిని అమ్ముకునేలా 'డి-రిజర్వ్' చేయాలని, తన వైద్య ఖర్చుల కోసం ఆ డబ్బే దిక్కని కోరారు. అలాగే అసైన్డ్ భూముల్లో సాగు చేసుకుంటున్న తమపై దాడులు చేస్తున్నారని, చంపేస్తామని బెదిరిస్తున్నారని పలువురు రైతులు వాపోయారు.
ఈ కార్యక్రమంలో కేవలం భూ సమస్యలే కాకుండా పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల నిర్మాణాల కోసం కూడా భారీగా దరఖాస్తులు వచ్చాయి. నిరుద్యోగ యువత తమకు ఉపాధి కల్పించాలని కోరుతూ రెజ్యూమెలు అందజేశారు. బాధితుల బాధలను విన్న మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో సామాన్యులకు అన్యాయం జరగనివ్వమని, అవినీతికి పాల్పడిన అధికారులు, అక్రమాలకు ఒడిగట్టిన నేతలపై కచ్చితంగా విచారణ జరిపిస్తామని భరోసా ఇచ్చారు.