భారతదేశంలో రాత్రి వేళ రోడ్లపై ప్రయాణించడం రోజురోజుకు ప్రమాదకరంగా( Indian Roads Safety)మారుతోంది. పగటి వేళ కనిపించే రద్దీతో పోలిస్తే రాత్రి రోడ్లు ఖాళీగా కనిపించినా, అసలు ముప్పు చీకటిలోనే దాగి ఉంటుంది. సరైన వీధి దీపాలు లేకపోవడం, అలసటతో వాహనాలు నడిపే డ్రైవర్లు, అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చే పశువులు వంటి అనేక కారణాలు రాత్రి ప్రమాదాలకు దారితీస్తున్నాయి. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకంగా మారే అవకాశముండటంతో, నిపుణులు కొన్ని కీలక జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
మొదటిగా ప్రతి డ్రైవర్ తప్పనిసరిగా తన వాహనంలోని హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు, విండ్షీల్డ్ పరిస్థితిని పరిశీలించుకోవాలి. మురికి పట్టిన హెడ్‌లైట్లు వెలుతురు శక్తిని సగానికి తగ్గిస్తాయి. దీంతో ముందు ఉన్న గుంతలు, అడ్డంకులు (Highway Safety Tips) చివరి క్షణంలో మాత్రమే కనిపిస్తాయి. ప్రయాణం ప్రారంభించే ముందు లైట్లను శుభ్రం చేయడం, పాత బల్బులు ఉంటే మార్చడం, విండ్షీల్డ్‌ను లోపల బయట శుభ్రం చేయడం ఎంతో అవసరం. ఈ చిన్న జాగ్రత్త అనేక ప్రమాదాలను నివారించగలదు.
రాత్రి వేళ హై బీమ్, లో బీమ్ లైట్ల వినియోగంలో డ్రైవర్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఖాళీ రోడ్లపై హై బీమ్ ఉపయోగించడం సరైనదే అయినా, ఎదురుగా వాహనం వస్తున్న వెంటనే లో బీమ్‌కు మార్చాలి. అలా చేయకపోతే ఎదుటి డ్రైవర్ కళ్లకు తీవ్ర ఇబ్బంది కలిగి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వీధి దీపాలు ఉన్న చోట లో బీమ్ మాత్రమే వాడటం సురక్షితం.
వేగం విషయానికి వస్తే, రాత్రి ప్రయాణంలో (Road Safety Tips) ఇది అత్యంత కీలక అంశం. చీకటి కారణంగా మన ప్రతిచర్య సమయం తగ్గిపోతుంది. పగటిపూట 80 కిలోమీటర్ల వేగంతో సురక్షితంగా బ్రేక్ వేయగలిగినా, రాత్రి అదే వేగం ప్రమాదానికి (Prevent Road Accidents)
దారి తీస్తుంది. అందుకే సాధ్యమైనంత వరకు వేగాన్ని తగ్గించి, ముందు వాహనంతో కనీసం నాలుగు సెకన్ల దూరం పాటించడం మంచిది. ఈ దూరం ఆకస్మికంగా బ్రేక్ వేయాల్సిన పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడుతుంది. ఎదురు వాహనాల నుంచి వచ్చే తీవ్రమైన వెలుతురు కూడా రాత్రి డ్రైవింగ్‌లో (Night Driving Safety Tips)
పెద్ద సమస్య. బలమైన ఎల్‌ఈడీ లైట్లు క్షణకాలం చూపును దెబ్బతీస్తాయి. అటువంటి సమయంలో నేరుగా ఎదురు లైట్లను చూడకుండా రోడ్డుకి ఎడమ వైపు దృష్టిని మళ్లించడం మంచిది. అలాగే ఎక్కువసేపు డ్రైవ్ చేయడం వల్ల వచ్చే అలసటను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. కళ్ళు భారంగా అనిపిస్తే వెంటనే వాహనాన్ని పక్కకు ఆపి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ప్రతి రెండు గంటలకు ఒకసారి ఐదు నిమిషాలు నడవడం, నీళ్లు తాగడం ఎంతో ఉపయోగకరం.
చివరిగా రోడ్డు పరిస్థితిని ముందే అంచనా వేసే అలవాటు పెంచుకోవాలి. ముందు దూరాన్ని గమనిస్తూ డ్రైవ్ చేయడం, అద్దాల్లో తరచూ వెనుక పరిస్థితిని పరిశీలించడం అవసరం. మలుపుల వద్ద ముందుగానే సంకేతాలు ఇవ్వడం, అవసరమైతే హారన్ వినియోగించడం సురక్షిత ప్రయాణానికి దోహదం చేస్తుంది. వర్షం లేదా పొగమంచు ఉన్నప్పుడు హాజర్డ్ లైట్లను జాగ్రత్తగా ఉపయోగిస్తూ మరింత నెమ్మదిగా ప్రయాణించాలి. అవసరమైతే గూగుల్ మ్యాప్ (Google Maps) వంటి నావిగేషన్ యాప్స్ ద్వారా చీకటి రోడ్లు లేదా ప్రమాదకర ప్రాంతాల గురించి ముందుగానే తెలుసుకోవచ్చు.
ఈ చిన్న కానీ ముఖ్యమైన జాగ్రత్తలను పాటిస్తే రాత్రి ప్రయాణం భయంకరంగా కాకుండా సురక్షితంగా మారుతుంది. ప్రాణాలు విలువైనవి కాబట్టి, గమ్యం కంటే ప్రయాణమే ముఖ్యమని ప్రతి డ్రైవర్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.