- గెలిచిన ఎమ్మెల్యేలను మహాబలిపురం రిసార్టుకు తరలించేందుకు ఏర్పాట్లు..
- Politics: ఫలితాలకు ముందే రిసార్ట్ రాజకీయాలకు సిద్ధమైన విజయ్ పార్టీ..
TVK Party: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడికి గడువు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ పరాకాష్టకు చేరుకుంది. వివిధ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని సూచించడంతో, నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అప్రమత్తమైంది. ఫలితాలు వెలువడిన తర్వాత తమ పార్టీ తరపున విజయం సాధించిన అభ్యర్థులను ఇతర పార్టీలు ప్రలోభాలకు గురిచేయకుండా ఉండేందుకు 'రిసార్ట్ రాజకీయాలకు' విజయ్ శ్రీకారం చుట్టారు. గెలిచిన ఎమ్మెల్యేలను సురక్షితంగా ఉంచేందుకు మహాబలిపురం సమీపంలోని పూంజేరి వద్ద గల ఒక ప్రముఖ ప్రైవేట్ రిసార్టులో ఇప్పటికే వంద మందికి పైగా బస చేసేలా భారీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మే 4వ తేదీన ఫలితాలు వెలువడగానే, అభ్యర్థులందరినీ నేరుగా ఈ రిసార్టుకు తరలించాలని విజయ్ తన ముఖ్య అనుచరులకు దిశానిర్దేశం చేశారు.
ఎన్నికల ఫలితాల అనంతరం ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి విజయ్ ముందస్తుగానే వ్యూహరచన చేశారు. గతవారమే అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన, విజయం ఖరారైన వెంటనే ఎక్కడికీ వెళ్లకుండా పనైయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో ఏవైనా సాంకేతిక లేదా న్యాయపరమైన అడ్డంకులు ఎదురైతే తక్షణమే స్పందించేలా పార్టీ లీగల్ టీమ్‌ను సైతం సిద్ధం చేశారు. అలాగే, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు భద్రత కల్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరాల్సిందిగా పార్టీ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జునను విజయ్ ఆదేశించారు. పకడ్బందీగా అడుగులు వేస్తున్న టీవీకే పార్టీ శ్రేణులు ఫలితాల కోసం ఆత్రుతగా వేచి చూస్తున్నాయి.
మరోవైపు, ప్రతిపక్షాల వ్యూహాలతో సంబంధం లేకుండా అధికార డీఎంకే వర్గాలు మాత్రం పూర్తి ధీమాతో ఉన్నాయి. క్షేత్రస్థాయిలో తమకు అనుకూల పవనాలు వీస్తున్నాయని, ఏ పార్టీ మద్దతు అవసరం లేకుండానే అతిపెద్ద పార్టీగా అవతరించి తిరిగి అధికారాన్ని చేపడతామని ఆ పార్టీ నేతలు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. తమిళ రాజకీయాల్లో గతంలోనూ అనేకసార్లు రిసార్ట్ రాజకీయాలు కీలకంగా మారిన నేపథ్యంలో, ఇప్పుడు విజయ్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది.