ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. కేంద్రం, రాష్ట్రం కలిసి విద్యార్థుల ప్రతిభను వెలికితీసే విధంగా "విద్యార్థి విజ్ఞాన్ మంథన్" (VVM) పేరుతో ప్రతిభా పోటీలు నిర్వహించనున్నాయి. ఆరో తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థుల కోసం ఈ పోటీలు ఉంటాయి. ఇది ఒక online exam గా నిర్వహించబడుతుంది. విద్యార్థులు సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.200 మాత్రమే.
ఈ పరీక్షలు తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో జరుగుతాయి. జూనియర్ (6-8 తరగతులు), సీనియర్ (9-12 తరగతులు) విభాగాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు నగదు బహుమతులు, స్కాలర్‌షిప్‌లు ఇవ్వబడతాయి. జూనియర్ విభాగం పరీక్షలు అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2 వరకు, సీనియర్ విభాగం పరీక్షలు నవంబర్ 19 నుంచి 23 వరకు ఉంటాయి. విద్యార్థులు వీలైన తేదీల్లో పరీక్ష రాయవచ్చు. సెప్టెంబర్ 1న మోడల్ ఎగ్జామ్ ఉంటుంది. ఆగస్టు 16 నుంచి వీవీఎం వెబ్‌సైట్‌లో చదువుకోడానికి కావాల్సిన study material అందుబాటులో ఉంటుంది.
వీటి ఆధారంగా స్కూల్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి విద్యార్థులను ఎంపిక చేస్తారు. స్కూల్ స్థాయిలో 18 మంది, జిల్లా స్థాయిలో సబ్జెక్టుకు ముగ్గురు, రాష్ట్ర స్థాయిలో 20 మంది ఎంపిక చేస్తారు. వీరందరికీ ప్రశంసాపత్రాలు, ధ్రువపత్రాలు, జ్ఞాపికలు అందిస్తారు. రాష్ట్ర స్థాయిలో టాప్ 3 విద్యార్థులకు వరుసగా రూ.5,000, రూ.3,000, రూ.2,000 అందిస్తారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి రూ.25,000 వరకు క్యాష్ బహుమతులు ఇవ్వబడతాయి.
అంతేకాదు, జాతీయ స్థాయిలో విజేతలకు ‘భాస్కరా స్కాలర్‌షిప్’గా నెలకు రూ.2,000 చొప్పున ఏడాది పాటు అందజేస్తారు. ఇది విద్యార్థులకు ఒక గొప్ప అవకాశంగా చెప్పొచ్చు. రీసెర్చ్ వైపు ఆసక్తి పెంచాలనుకునే విద్యార్థులు తప్పక ఈ పోటీలో పాల్గొనాలి. వారు వెంటనే వీవీఎం పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.