డిజిటల్ లావాదేవీల్లో (Digital transactions) విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన యూపీఐ (UPI) సేవలపై గత కొన్ని రోజులుగా ‘శాశ్వతంగా ఉచితం’ అనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. ఈ విషయంపై స్పష్టతనిస్తూ, ప్రజల్లో ఏర్పడిన అపోహను తొలగించే ప్రయత్నం చేశారు.
తాను గతంలో ఇచ్చిన వ్యాఖ్యలపై కొంతమంది తప్పుబట్టిన తీరును గమనించిన గవర్నర్, “యూపీఐ ఎప్పటికీ ఉచితమని నేను చెప్పలేదు. చెల్లింపులపై ఛార్జీలు ఉంటాయి. వాటిని ఎవరో ఒకరు చెల్లించాల్సిందే. కానీ ప్రస్తుతం వాటిని ప్రభుత్వమే భరిస్తోంది” అని అన్నారు.
ఈ సేవలు ప్రజలకు నేరుగా ఉచితంగా అందుతున్నా, దీని వెనుక ఉన్న టెక్నాలజీ, సర్వర్ నిర్వహణ, ఇంటర్మీడియరీ సేవల ఖర్చు వంటి అంశాలన్నీ వ్యయంతో కూడుకున్నవే. వాటిని ప్రస్తుతం సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరిస్తోంది అని గవర్నర్ పేర్కొన్నారు.
గమనించాల్సిన విషయం ఏమిటంటే, యూపీఐ సేవల విస్తరణ ప్రభుత్వానికి చాలా ప్రాధాన్యత. దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు పెరగాలన్నదే కేంద్ర పాలసీ. అందుకే, ఇప్పటికి వినియోగదారులకు ఛార్జీలు లేకుండా సేవలు అందుతున్నాయి. అయితే ఇది శాశ్వతమా? అన్నదానిపై గవర్నర్ ఏమాత్రం హామీ ఇవ్వలేదు.
‘‘యూపీఐ సేవలకు ఖర్చు లేదు అనే భావన సరైంది కాదు. ఛార్జీలు ఉన్నాయే తప్ప, వాటిని తాత్కాలికంగా ప్రభుత్వమే భరిస్తోంది. భవిష్యత్తులో మార్పులు రావచ్చు’’ అంటూ ఆయన సూచనలతో సమాధానం ఇచ్చారు.
ఇలా చూస్తే, ప్రస్తుతం ప్రజలకు ఉచితంగా లభిస్తున్న యూపీఐ సేవలు భవిష్యత్తులో ఛార్జీలకు లోనవవచ్చు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే వాటిపై ఎలాంటి స్పష్టమైన నిర్ణయం లేదా షెడ్యూల్ ఇంకా వెలువడలేదు.