ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాల్నాడు జిల్లా ఈపూరు మండలం అరెపల్లి ముప్పాళ్ల గ్రామానికి చెందిన తుర్లపాటి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అమెరికాలో ఉన్న వారి తొమ్మిదేళ్ల కుమారుడు యత్విక్ సాయి దుర్మరణానికి గురయ్యాడు. ఈ ఘటన మిస్సోరి రాష్ట్రం జెఫర్సన్ సిటీలో శుక్రవారం చోటుచేసుకుంది.
పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు, యత్విక్ సాయి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక ట్రక్కు అతడిని ఢీకొట్టింది. ఢీకొన్న తారజానికే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా, వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు ధృవీకరించారు.
పాపం ఈ చిన్నారి మరణ వార్త వారి సన్నిహితులను, గ్రామస్తులను దిగ్బ్రాంతికి గురిచేసింది. తల్లిదండ్రులు అమెరికాలోనే ఉంటూ అక్కడ ఉద్యోగాల్లో కొనసాగుతుండగా, అకాలంలో కుమారుడిని కోల్పోవడం వారికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ప్రస్తుతం వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
యత్విక్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అధికారిక ప్రక్రియలు కొనసాగుతున్నట్టు సమాచారం. గ్రామస్థులు, స్నేహితులు ఈ కుటుంబానికి మానసికంగా ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదం స్థానికంగా కూడా చర్చనీయాంశంగా మారింది.
ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని మరోసారి ఈ సంఘటన రుజువు చేసింది.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        