రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించబోతున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని అన్నవరంలో స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో నిర్వహించిన 'సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ఉద్ఘాటించారు. “మహిళలు రాష్ట్రమంతా ఉచితంగా ప్రయాణించేలా పథకం రూపొందించాం.
5 రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పిస్తాం. ఆటోడ్రైవర్లకు ఆగస్టు 15న ఆర్థిక సాయం చేస్తాం. ఆగస్టు 2, 3వ తేదీల్లో అన్నదాత సుఖీభవ సొమ్ము జమ చేస్తాం. జగన్ ప్రభుత్వం నిలిపేసిన వితంతు పింఛన్లు పునరుద్ధరించాం.
అర్హులైన వితంతువులకు ఆగస్టు 1న పింఛన్లు పంపిణీ చేస్తాం" అని అచ్చెన్నాయుడు తెలిపారు. అంతకుముందు శంఖవరం మండలంలోని కత్తిపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు.